జీవో 68 అమలు నామ్ కే వాస్తే.. గ్రేటర్​లో వాహనదారులకు తప్పని పార్కింగ్ కష్టాలు

జీవో 68 అమలు  నామ్ కే వాస్తే.. గ్రేటర్​లో వాహనదారులకు తప్పని పార్కింగ్ కష్టాలు
  • ఎక్కడ చూసినా ఇష్టారాజ్యంగా ఫీజు వసూలు
  • మెట్రో, బస్టాప్,  రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఫీజు పై  నో క్లారిటీ  
  •  ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలంటున్న బల్దియా అధికారులు

హైదరాబాద్, వెలుగు: సిటీలో వాహనదారులకు పార్కింగ్ కష్టాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పార్కింగ్ ఫీజులు పెంచుతుండటంతో పాటు ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు.  సిటీలో ప్రస్తుతం ఎక్కడికి  వెళ్లినా పార్కింగ్ ఫీజు చెల్లించక తప్పడం లేదు.  పార్కింగ్‌‌‌‌‌‌‌‌కి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా 2018లో జీవో  నం.68ను జారీ చేసినా అది.. నామ్ కే వాస్తేగా అమలవుతోందని వాహనదారులు చెబుతున్నారు.  మాల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లతో పార్కింగ్ ఫీజు వసూలుపై జీవో రూల్స్ ను నిర్వాహకులు పాటించడం లేదు. అందుకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు.  కార్పొరేట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో  ఫోర్ వీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి 3 గంటల లోపు అయితే మినిమమ్ రూ.50 , టూ వీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి 5 గంటల లోపు అయితే  మినిమమ్ రూ.30 వసూలు చేస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు.  ఆ తర్వాత గంటకి రూ.10 చొప్పున కలెక్ట్​ చేస్తున్నారు.  మెట్రో రైల్, బస్టాప్, రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఫీజు ఎంత వసూల్ చేయాలనే దానిపై జీవోలో క్లారిటీ ఇవ్వలేదు.  ప్రభుత్వం జారీ చేసిన జీవోలో క్లారిటీ లేకపోవడంతో అధికారులు కూడా జరిమానా విధించి వదిలేస్తున్నారు. రూల్స్ కు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు కలెక్ట్ చేస్తున్న ఏజెన్సీలకు రూ.50 వేల చొప్పున బల్దియా అధికారులు ఫైన్ వేసినా మార్పు కనిపించడం లేదు.

నిమ్స్​​లో అడ్డగోలు దోపిడీ..

 పంజాగుట్ట నిమ్స్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్ పార్కింగ్​లో పేషెంట్ బిల్లు చూపించినా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని ఓ వ్యక్తి ఇటీవల జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు ఏజెన్సీకి బల్దియా అధికారులు రూ.50 వేల ఫైన్ విధించడంతో పాటు ఆ ఏజెన్సీని తొలగించి కొత్తవారికి పార్కింగ్ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అయితే, ప్రస్తుతం ఉన్న ఏజెన్సీ గతంలో కంటే ఎక్కవ ఫీజు కలెక్ట్ చేస్తున్నదని వాహనదారులు వాపోతున్నారు. గతేడాది వరకు కార్ల పార్కింగ్​కు గంటకు రూ.50 ఉండగా ఇప్పుడు రూ.80 వసూలు చేస్తున్నారు. బైక్​లకు రూ.20 తీసుకుంటున్నారు. పార్కింగ్ చేసిన తర్వాత అరగంట లోపు వెహికల్​ను తీసుకెళ్తే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పేషెంట్  బిల్లులు ఉన్నవారికి  ఫ్రీ పార్కింగ్ ఉంటుంది.  అయితే ఈ  రూల్స్​ నిమ్స్​లో అమలు కావడం లేదని వాహనదారులు చెబుతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్​లో 3 గంటల లోపు అయితే మినిమమ్ రూ.50, టూ వీలర్​కి 5 గంటల లోపు అయితే మినిమమ్ రూ.30 వసూలు చేస్తున్నారంటున్నారు.
 
బస్టాప్​లు, రైల్వే స్టేషన్ల వద్ద అదే పరిస్థితి..

సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్, మెట్రో రైల్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు ఓపెన్​ స్పేస్​లో పార్కింగ్ కలెక్ట్​ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, ఇక్కడ కూడా ఎంత వసూల్ చేయాలనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇస్తే  ఇబ్బంది లేకుండా ఉంటుందని వాహనదారులు చెబుతున్నారు. దీనిపై క్లారిటీ లేకపోవ
డంతో అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు. బస్టాప్​ల్లో టూవీలర్ కి డైలీ  రూ.60, రైల్వే స్టేషన్​లో అయితే టూ వీలర్ కి మినిమమ్ 2 గంటలకు రూ.15, ఆ తర్వాత  గంటకు రూ.10 వసూలు చేస్తుండగా, 17 గంటల నుంచి 24 గంటల లోపు అయితే  రూ.180, ఫోర్ వీలర్ అయితే మినిమమ్ 2 గంటలకు  రూ.50, తర్వాత గంటకు రూ.50 వసూల్ చేస్తున్నారు.  పిక్ అండ్ డ్రాప్ దగ్గర అయితే 8 నిమిషాల వరకు ఫ్రీగా ఉండగా, ఆ తర్వాత 15 నిమిషాల లోపు రూ.100, 30 నిమిషాల లోపు రూ.200 అంతకు మించితే రూ.500 కలెక్ట్  చేస్తున్నారు.

ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం

జీవో 68కు విరుద్ధంగా ఎక్కడైనా పార్కింగ్ ఫీజు కలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు తమ దృష్టికి తీసుకొస్తే నిర్వాహకులకు రూ.50 వేల ఫైన్ వేస్తాం.  ఎన్ని ఫిర్యాదులు వస్తే అన్ని సార్లు ఫైన్లు వేస్తాం.   మొదటి 30 నిమిషాల పాటు ఫ్రీ పార్కింగ్  కల్పించాలి.  రూల్స్ కు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే బల్దియా ఎన్​ఫోర్స్​మెంట్​కు  కంప్లయింట్ చేయొచ్చు.

– ప్రకాశ్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్   

ఫిర్యాదు చేయండిలా..

బిల్డింగ్​ నిర్మించే సమయంలో మొత్తం బిల్డింగ్ స్పేస్‌‌‌‌‌‌‌‌లో 40 శాతం పార్కింగ్​ స్పేస్‌‌‌‌‌‌‌‌ని కల్పిస్తున్నట్లు పర్మిషన్ తీసుకుంటారు. ఆ స్పేస్‌‌‌‌‌‌‌‌ పార్కింగ్​ కోసం కేటాయిస్తున్నప్పుడు డబ్బు​ చెల్లించే అవసరం లేదని ప్రభుత్వ ఉత్తర్వులు చెబుతున్నాయి.  కానీ జీవోలో ఉన్న కొన్ని వెసులుబాటును అడ్డు పెట్టుకొని పార్కింగ్ ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. ఇందులోనూ చాలా కండీషన్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్, ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ ల్లో మొదటి అరగంట ఫ్రీ పార్కింగ్ కల్పించాలి.  తర్వాత పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ బిల్లు వేస్తే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.  ఇందుకు విరుద్ధంగా ఎక్కడైనా పార్కింగ్​ వసూల్  చేస్తే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు.  ఇందుకోసం పార్కింగ్ ​రశీదుతో పాటు షాపింగ్‌‌‌‌‌‌‌‌కి సంబంధించిన బిల్లు లేదా హాస్పిటల్స్ పేషెంట్ బిల్లు ఉంటే దాంతో లేకపోతే కేవలం పార్కింగ్​ బిల్లుతో జీహెచ్ఎంసీ ఎన్​ఫోర్స్​మెంట్​ట్విట్టర్, వాట్సాప్ నం 9154114998 లేదా బుద్ధభవన్ లోని జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు నేరుగా  కంప్లయింట్ చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే సదరు పార్కింగ్ నిర్వాహాకులకు  అధికారులు రూ.50 వేల ఫైన్ విధిస్తారు.ఏదైనా సందేహాలు ఉంటే హెల్ప్​ లైన్ నెంబర్ 040–21111111 కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.