గోదావరిఖని, వెలుగు : ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడిన ఓ యువకుడు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం వెలుగుచూసింది. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని విఠల్‌నగర్‌కు చెందిన తూండ్ల రోహిత్ (25) అడ్డగుంటపల్లిలోని బేకరీలో పనిచేస్తున్నాడు.
రోహిత్ కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై పలు చోట్ల అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు డబ్బులు కావాలని.. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికురాలిగా పనిచేసే తన తల్లి తిరుమలను అడుగగా.. ఆమె రూ. 5 లక్షలు ఇచ్చింది. తర్వాత తిరుమల సమీపంలోనే ఉండే తన తల్లి వద్దకు వెళ్లింది. బుధవారం ఉదయం ఆమె తిరిగి వచ్చే సరికి రోహిత్ ఉరి వేసుకొని కనిపించాడు. తిరుమల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
