
ఇండియాలో బంగారానికి ఉన్న క్రేజ్ మరే ఆభారణానికి లేదంటే అతిశయోక్తి కాదు. డబ్బులు బ్యాంకులో వేసేకంటే ఎంతో కొంత బంగారం కొనిపెడితే మంచి లాభం ఉంటుందని అనుకోవడం కామన్. అందుకోసమే ఇటీవల తులం బంగారం ఆల్ టైమ్ హై లక్ష మార్క్ ను గోల్డ్ దాటడంతో ఇండియన్స్ ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ (FOMO)’కు గురవుతున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. లక్ష దాటిన తర్వాత మళ్లీ మెల్ల మెల్లగా కూల్ ఆఫ్ అవుతున్న సందర్భంగా.. మళ్లీ పెరిగితే కష్టం.. ఇప్పుడే కొనిపెట్టాలనే ప్లాన్ లో ఇండియన్స్ ఉన్నారు.
కోవిడ్ తర్వాత గోల్డ్ విపరీతంగా పెరిగింది. అంతెందుకు ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 30 వేలకు పైగా బండారం ధరలు పెరిగాయి. ఇప్పుడు కొని ఓ నాలుగైదు ఏండ్లు దాచితే మంచి రిటర్న్స్ ఇస్తాయని అనుకుంటున్నారు అందరు. అయితే ఈ ఫోమో లో ఎగబడి కొంటే నష్టపోవడం పక్కా అని ఎనలిస్టులు చెబుతున్నారు. షార్ట్ టర్మ్ లాభాల కోసం బంగారం వెంట పడితే నష్టాలు ఎదుర్కోవడం తప్పదని ప్రముఖ చార్టెడ్ అకౌంట్ నితేశ్ బుద్ధదేవ్ చెబుతున్నాడు.
గత 8 ఏండ్లలో బంగారం జీరో రిటర్న్స్ ఇచ్చిందని తన లింక్డిన్ ప్రొఫైల్ లో రాసుకొచ్చాడు. 2012 నుంచి 2019 వరకు తులం బంగారం రూ.31,050 నుంచి రూ.35,220 వరకు మాత్రమే పెరిగింది. మరో దశాబ్దం 1992 నుంచి 2002 వరకు రూ.4334 నుంచి 4990 రూపాయల వరకు మాత్రమే పెరిగింది. అంటే 1.5 శాతం CAGR చొప్పున కూడా లాభాలు ఇవ్వలేక పోయింది.
అయితే 2020 తర్వాత బంగారం డబుల్ రిటర్న్స ఇవ్వడానికి కారణం.. ఎనిమిదేండ్లు స్తబ్దుగా పెరగకుండా ఉండటం.. కోవిడ్ 19, యుద్ధం భయాలు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడం.. ఈ కారణాల వల్ల గోల్డ్ ఒక్కసారిగా డబుల్ అయ్యింది. చాలా రోజులు పెరగకుండా నష్టాలు ఇచ్చిన తర్వాత ఒకసారి షార్ప్ ర్యాలీ వస్తుంది. అందుకే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ గా గోల్డ్.. అంటే మూడు లేదా ఐదు ఏండ్ల పెట్టుబడుల కోసం గోల్డ్ ను ఎంచుకుంటే నష్టాలు తప్పవని చెబుతున్నాడు.
అయితే డైవర్సిఫికేషన్ కు గోల్డ్ మంచి ఆప్షన్. కానీ కన్సిస్టెంట్ గ్రోత్ ను ఇచ్చే అసెట్ మాత్రం బంగారం కాదని బుద్ధదేవ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. గోల్డ్ దశాబ్ద కాలం పాటు పెరగకుండా ఇన్వెస్టర్లను ఏడిపించిన సందర్భాలే ఎక్కువ. అందుకే బంగారంలో పెట్టుబడి పెట్టినా.. అది తక్కువ శాతానికి పరిమితం అయ్యేలా చూసుకోవాలని సూచిస్తున్నాడు.
2025లో 25 శాతం పెరిగింది బంగారం. అయితే క్వార్టర్ 1 లో డిమాండ్ 15 శాతానికి పడిపోయినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ప్రస్తుతం ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఉన్నంతవరకు డిమాండ్ ఉన్నట్లు కనిపిస్తుందని, ఆ తర్వాత మళ్లీ చాలా కాలం గోల్డ్ ఒకే దగ్గర ఉండే ఛాన్సెస్ ఉన్నాయని తెలిపాడు. సో.. బంగారంపై ఇన్వెస్ట్ మెంట్ చేసే వాళ్లు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటర్.