
న్యూఢిల్లీ : అమెరికాలో ఈ ఏడాది మరో మూడు సార్లు ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే ఛాన్స్ ఉందని గోల్డ్‌మన్ శాచ్స్ అంచనా వేస్తోంది. ఇన్ఫ్లేషన్ భయం పూర్తిగా పోకపోవడంతోపాటు, లేబర్ మార్కెట్ తాజా డేటా చూసి ఈ అంచనాకు వచ్చినట్లు గోల్డ్‌మన్ శాచ్స్ తెలిపింది. కిందటి ఏడు నెలల కాలానికి చూస్తే ప్రొడ్యూసర్ల రేట్లు ఒకింత ఎక్కువగానే పెరిగాయని, కొత్త ఉద్యోగాలు ఎక్కువవుతున్నాయని తాజా డేటా వెల్లడిస్తోంది. తాజా డేటాను విశ్లేషిస్తే ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే సూచనలే ఎక్కువని గోల్డ్‌మన్ శాచ్స్ పేర్కొంది. ఈ కంపెనీతో పాటు మరి కొంత మంది ఎకానమిస్టులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, వడ్డీ రేట్ల తగ్గింపు 2023 లో సాధ్యం కాదని కూడా వారు చెబుతున్నారు.
ఈ ఏడాది రేట్లు తగ్గవు..
ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రాకపోవడంతో అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే ఛాన్స్‌లే ఎక్కువని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ చెప్పారు. యూఎస్‌లో ఇన్ఫ్లేషన్ టార్గెట్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందనే అంశాన్ని గమనించాలని ఆయన ట్వీట్ చేశారు.