రాష్ట్రంలో కరెంట్ లెక్కల్లో గోల్‌మాల్

రాష్ట్రంలో కరెంట్ లెక్కల్లో గోల్‌మాల్
  • మిగులులోనే ఉన్నా.. నష్టాలంటూ లెక్కలు చూపుతున్న విద్యుత్ సంస్థలు
  • ఈఆర్సీకి ‘మెర్కడోస్ ఎనర్జీ మార్కెట్స్ ఇండియా’ కన్సల్టెన్సీ రిపోర్ట్
  • డిస్కంలకు వచ్చే ఏడాది రూ.11,383 కోట్ల మిగులు ఉంటుందని వెల్లడి
  • మరి కరెంటు చార్జీలు తగ్గాలి కానీ పెంచడమేంటని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరెంట్ లెక్కల్లో గోల్‌మాల్ జరుగుతున్నది. మిగులులోనే ఉన్నప్పటికీ నష్టాలు వస్తున్నాయంటూ డిస్కంలు చెబుతున్నాయి. కరెంట్ కొనుగోళ్ల లెక్కలు ఎక్కువగా చూపిస్తూ.. వాటిని నష్టాల కింద పేర్కొంటున్నాయి. వాస్తవాలన్నింటినీ పరిశీలిస్తే వచ్చే ఏడాది 2023–24కు డిస్కంలకు రూ.11,383 కోట్ల మిగులు ఏర్పడుతున్నది. ఈ లెక్కన కరెంట్ చార్జీలు తగ్గించాలి కానీ.. వివిధ రూపాల్లో జనాలపై బాదడం సరికాదని విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ఢిల్లీకి చెందిన ‘మెర్కడోస్ ఎనర్జీ మార్కెట్స్ ఇండియా’  కన్సల్టెన్సీ రిపోర్ట్ అందజేసింది.
ఇటీవల రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంలు ఈఆర్సీకి రెండు రిపోర్ట్​లను సమర్పించాయి. 2023–24కు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) నివేదికను గత నవంబర్​ 30న ఇచ్చాయి. 2016–22 మధ్యకాలంలో డిమాండ్ కారణంగా ముందస్తుగా ఈఆర్​సీ ఇచ్చిన అనుమతి కన్నా అధికంగా కరెంట్ కొనాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ఇందుకోసం చేసిన రూ.12,014 కోట్ల అదనపు ఖర్చులను ప్రజల నుంచి కరెంట్ చార్జీల ద్వారా వేసి వసూలు చేసుకోవడానికి అనుమతించాలని ట్రూ అప్​ రిపోర్ట్​లను రెండు డిస్కంలు ఇచ్చాయి. వీటిని అధ్యయనం చేసిన మెర్కడోస్.. డిస్కంల పనితీరు లోపాలను ఎత్తిచూపింది. ఏఆర్ఆర్, ట్రూ అప్ రిపోర్టులను స్టడీ చేస్తే కొన్ని అంశాల్లో అధిక వ్యయం చూపడం, మరికొన్ని అంశాల్లో చేసిన తప్పులతో అడిషనల్ ఖర్చు పెరిగినట్లు లెక్కలు చూపారని తన రిపోర్టులో వివరించింది. వాస్తవాలను పరిశీలిస్తే డిస్కంలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11,383 కోట్లు మిగులు ఉంటుందని వెల్లడించింది.

ఈఆర్సీకి ఇచ్చిన నివేదికలో మెర్కడోస్ ప్రస్తావించిన అంశాలివే

  • l 2016–23 మధ్య ఏడేళ్ల కాలంలో ఈఆర్‌‌‌‌సీ అనుమతించిన దానికన్నా అడిషనల్ కరెంట్ కొన్నందుకు రూ.12,014 కోట్ల భారం పడిందని, దీని వసూలుకు పర్మిషన్ ఇవ్వాలని ట్రూఅప్‌‌ రిపోర్ట్​లో డిస్కంలు కోరాయి. కానీ కొనుగోళ్లు చూస్తే అదనంగా పడిన భారం రూ.439.72 కోట్లు మాత్రమే. దీన్ని మాత్రమే అనుమతించాల్సి ఉన్నది.
  • l అగ్రికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు కలిపి 2021–22 కన్నా.. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కరెంట్ వినియోగం ఉత్తర డిస్కంలో 48%, దక్షిణ డిస్కంలో 3% తగ్గుతున్నట్లు అంచనా వేశారు. కానీ 2023–24లో ఉత్తర డిస్కంలో 298%, దక్షిణ డిస్కంలో 108% అదనంగా వినియోగం పెరుగుతుందని ఏఆర్ఆర్​లో తమ అంచనాలను పేర్కొన్నారు. ఇంత పెరుగుదల ఏ రకంగా ఉంటుంది? ఈ విషయంలో గతంలో కరెంట్ వినియోగం ఎలా ఉందనేది డిస్కంలకు తెలియదా? ఇందులో క్లారిటీ ఎందుకు తెచ్చుకోలేదు. 
  • l వచ్చే ఏడాది 17,417 మిలియన్ యూనిట్ల కరెంట్ మిగులు ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. ఒక్క యూనిట్ కరెంట్ కొనేందుకు యావరేజ్​గా రూ.5.17 చొప్పున డిస్కంలు వెచ్చిస్తున్నాయి. ఇదే ధరకు మిగులు కరెంట్ 17,417 మిలియన్ యూనిట్లను అమ్ముకుంటే రూ.9 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. కానీ ఈ సొమ్మును ఆదాయంలో చూపలేదు. మిగులు కరెంట్ విషయం ఆదాయంలో ఎందుకు ప్రస్తావించలేదు. 
  • l డిస్కంలు ఒక యూనిట్ కరెంట్ సరఫరాకు సగటు వ్యయం కన్నా 20% ఎక్కువ లేదా తక్కువ పరిమితిని దాటి వినియోగదారుల నుంచి వసూలు చేయకూడదని విద్యుత్ చట్టం స్పష్టంగా చెబుతోంది. ఈ రూల్​ ప్రకారం ఉత్తర డిస్కంలో ఒక యూనిట్​కు గరిష్టంగా రూ.7.72, దక్షిణ డిస్కంలో రూ.6.73కు మించి అదనంగా చార్జీలను ఏ వినియోగదారుడి నుంచి కూడా వసూలు చేయకూడదు.