ఏఐ అడుగులతో గూగుల్ లేఆఫ్స్: క్లౌడ్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాల కోత..

ఏఐ అడుగులతో గూగుల్ లేఆఫ్స్: క్లౌడ్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాల కోత..

ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా గూగుల్ తన క్లౌడ్ విభాగంలో భారీగా ఉద్యోగులను తొలగించింది. ఇందులో ముఖ్యంగా గూగుల్ సెక్యూరిటీ రీసెర్చ్ యూనిట్ అయిన ‘థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్’తో పాటు.. 2022లో గూగుల్ కొనుగోలు చేసిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘మాండియంట్’ సిబ్బందిపై లేఆఫ్స్ ప్రభావం పడింది. గడిచిన 2 వారాలుగా ఈ తొలగింపుల ప్రక్రియ నిశ్శబ్దంగా సాగుతోంది. కంపెనీలు తమ వనరులను ఏఐ వైపు మళ్లించడమే ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణం.

హ్యాకర్ల కదలికలు, గ్లోబల్ సైబర్ బెదిరింపులపై నివేదికలు ప్రచురించే అత్యంత ప్రతిష్టాత్మకమైన థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్‌లో కోతలు విధించడం టెక్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ లేఆఫ్స్ గురించి గూగుల్ ప్రతినిధి స్పందిస్తూ.. మారుతున్న పరిశ్రమ డిమాండ్లు, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అంతర్గతంగా మార్పులు క్రమం తప్పకుండా సమీక్షిస్తుంటామని తెలిపారు. అయితే ఏఐ డెవలప్‌మెంట్ వంటి వృద్ధి చెందుతున్న రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం గూగుల్ మాత్రమే కాదు.. గత నెలలో మెటా తన శ్రామిక శక్తిలో 10% కోత విధించగా, కాయిన్‌బేస్, బ్లాక్ అండ్ క్లౌడ్‌ఫ్లేర్ వంటి సంస్థలు కూడా ఏఐ పెట్టుబడుల సాకుతో వేలాది మందిని తొలగించాయి.

ALSO READ : AI కారణంగా జాబ్ పోయింది.. ఛాలెంజ్ చేసి మరీ ఏఐ జాబ్ కొట్టాడు.. 

ఈ పరిస్థితుల్లో గూగుల్ ఏఐ సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల డెవలపర్ల ఉత్పాదకత 3 నుండి 4 రెట్లు పెరిగినప్పుడు.. ఆ సామర్థ్యంతో 3 నుండి 4 రెట్లు ఎక్కువ పని చేయించుకోవాలే తప్ప.. ఉద్యోగులను బయటకు పంపడం సరైన వ్యూహం కాదని అభిప్రాయపడ్డారు. ఏఐ వృద్ధిని ఉద్యోగాల తగ్గింపునకు సాకుగా చూపడం ఒక విఫల వ్యూహమని మండిపడ్డారు. ఇతర కంపెనీలు వదిలించుకుంటున్న టాలెంటెడ్ ఇంజనీర్లను చేరదీయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, డ్రగ్ డిస్కవరీ నుంచి గేమ్ డిజైన్ వరకు తన వద్ద మిలియన్ల కొద్దీ ఐడియాలు ఉన్నాయని పిలుపునిచ్చారు. టెక్ కార్మికులకు ఇది అత్యంత క్లిష్ట సమయమని.. ఈ ఏడాదిలోనే ఇప్పటికే లక్షా 42వేల మందికి పైగా టెక్ ఉద్యోగులు రోడ్డున పడ్డారని లేఆఫ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.