అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ షాకింగ్ హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులు, అపాయింట్‌మెంట్ల ఆలస్యాల కారణంగా అమెరికా వదిలి వెళ్తే తిరిగి రావడానికి ఏకంగా ఏడాది కాలం పట్టవచ్చని హెచ్చరించింది. ట్రంప్ కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ రూల్స్ హెచ్1బి, హెచ్4 వీసా హోల్డర్లకు కూడా అమలు చేస్తున్న క్రమంలో తాజా అడ్వైజరీ వచ్చింది.
గూగుల్ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్‌లో అంతర్జాతీయ ప్రయాణాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా H-1B, L-1 వంటి వర్క్ వీసాలపై ఉన్నవారు ప్రస్తుతం అమెరికా వదిలి వెళ్లడం 'రిస్క్' తో కూడుకున్నదని అందులో పేర్కొంది. ఒకవేళ అత్యవసరమై విదేశాలకు వెళ్తే.. తిరిగి రావడానికి అవసరమైన వీసా స్టాంపింగ్ కోసం అమెరికా ఎంబసీల్లో ఎదురుచూపులు తప్పవని హెచ్చరించింది.
అయితే ఈ ఆలస్యానికి గల కారణాలను పరిశీలిస్తే.. అమెరికా ప్రభుత్వం వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలించే ప్రక్రియనుకఠినతరం చేయటం మెుదటిది. దీనివల్ల ప్రతి అప్లికేషన్ ప్రాసెసింగ్ సమయం పెరిగింది. అలాగే భారత్‌లోని హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లోని అమెరికా కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూ స్లాట్‌లు దొరకడం గగనంగా మారింది. డిసెంబర్ 2025 నాటి అపాయింట్‌మెంట్లు చాలావరకు 2026 మార్చి లేదా జూన్ వరకు వాయిదా పడ్డాయి. అలాగే గతంలో ఉన్న 'ఇంటర్వ్యూ వేవర్' అదే డ్రాప్‌బాక్స్ సౌకర్యాన్ని పరిమితం చేయడం వల్ల అందరూ పర్సనల్‌గా హాజరు కావాల్సి వస్తుండటం ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తోంది.
►ALSO READ | స్పెషల్ ఆఫర్, నెలకు రూ.3333 కట్టి కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్లండి.. గూగుల్ పిక్సెల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్..
ఈ జాప్యం వల్ల ఇప్పటికే సెలవులకు ఇండియా వచ్చిన వందలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇక్కడే చిక్కుకుపోయారు. ఎక్కువ కాలం అమెరికాకు దూరంగా ఉంటే ప్రాజెక్టుల నిర్వహణ కష్టమవుతుంది. విదేశాల్లో ఉన్నప్పుడు వీసా గడువు ముగిస్తే, కంపెనీలు మళ్లీ కొత్తగా వీసా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం భారీగా ఫీజులు చెల్లించాల్సి రావచ్చు. కొంతమంది పిల్లలు అమెరికాలో స్కూళ్లకు వెళ్తుంటే.. తల్లిదండ్రులు ఇండియాలో వీసా కోసం ఆగిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఒకవేళ మీ వీసా గడువు ముగిసి ఉండి, స్టాంపింగ్ అవసరమైతే.. ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే ఉత్తమమని గూగుల్ కంపెనీతో పాటు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
