
- కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి
వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి జిల్లా ఉమ్మడి గోపాల్ పేట మండలానికి వ్యవసాయ మార్కెట్ ను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ నెం112 జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గురువారం ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుతో గోపాల్ పేట, రేవల్లీ, ఏదుల మండలాల రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పెరుగుతున్న సాగు , పంట దిగుబడులు, రైతుల రవాణా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
మార్కెట్ యార్డు నిర్మాణానికి అనుమతులు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే రిజర్వేషన్స్ ప్రాతిపాదికన మార్కెట్ యార్డుకు సంబంధించిన కమిటీనీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
రూ.7 లక్షల ఎల్వోసీ మంజూరు..
వనపర్తి పట్టణంలోని రాయిగడ్డకు చెందిన నందమోని బాలరాజు కుమార్తె రేవతికి వినికిడి సమస్య ఉండడంతో వినికిడి మిషన్ కోసం ఎమ్మెల్యే మేఘారెడ్డి రూ.7 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించారు. నెల రోజుల కింద రేవతి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే ఆమెకు పుట్టుక నుంచి వినికిడి సమస్య ఉన్నట్లు తండ్రి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే రేవతికి అత్యాధునిక వినికిడి మిషన్ కాక్లేర్ ఇంప్లాంట్ కోసం రూ.7 లక్షల ఎల్వోసీ ని మంజూరు చేయించారు. దీంతో రేవతి, వారి కుటుంబ సభ్యులు మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.