మరో టెట్ నిర్వహించాలి

మరో టెట్ నిర్వహించాలి

తెలంగాణ ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చింది. టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. టీచర్​గా నియామకం కాబోయే అభ్యర్థికి టెట్​అర్హత తప్పనిసరి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరో టెట్ నిర్వహించాలి. ఎన్​సీఆర్టీ నిబంధనల ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు టెట్​నిర్వహించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఏటా రెండు సార్లు టెట్​పరీక్ష పెట్టడం లేదు. టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు, వివిధ కారణాలతో టెట్​పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులు పరీక్ష నిర్వహణ కోసం ఎదురు చూస్తున్నారు. టీచర్​ పోస్టు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్​విడుదల చేయడానికి కొంత సమయం పట్టనున్న నేపథ్యంలో టెట్​పరీక్ష పెట్టాలి. 

అలాగే, తెలంగాణ ప్రభుత్వం  ఎస్జీటీ వారి కోసం పేపర్1, స్కూల్ అసిస్టెంట్ కోసం పేపర్ 2  నిర్వహిస్తున్నది. ఈ పరీక్ష విధానం వల్ల తెలుగు, హిందీ,  ఉర్దూ,  భాషా పండిట్ అభ్యర్థులు  తీవ్రంగా నష్టపోతున్నారు. లాంగ్వేజ్ పండిట్ ల కోసం మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్  పేపర్3 నిర్వహిస్తున్నది. అదే విధానాన్ని మన తెలంగాణలోనూ కొనసాగించాలి. లాంగ్వేజ్ పండిట్ లు పేపర్ 2 రాయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ పేపర్​లో పండిట్ లకు సంబంధం లేని సోషల్, మాథ్స్, సబ్జెక్టులకు సంబంధించి  60 మార్కులు ఉంటాయి. దీంతో టెట్ క్వాలిఫై కాలేకపోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. అందుకే తమకు పేపర్ 3 
నిర్వహించాలని కోరుతున్నారు. - దేవులపల్లి రమేశ్,ఉస్మానియా యూనివర్సిటీ