పిల్లలపై న్యుమోనియా ఎటాక్

పిల్లలపై న్యుమోనియా ఎటాక్

ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న తల్లిదండ్రులు
పిల్లలతో దవాఖాన్లు కిటకిట
నీలోఫర్‌‌‌‌, ఎంజీఎంలో బెడ్లు ఫుల్‌‌‌‌.. పేషెంట్లకు ఇబ్బందులు 


హైదరాబాద్‌‌‌‌, వెలుగు : 
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లు పిల్లలతో కిటకిటలాడుతున్నయి. హైదరాబాద్‌‌‌‌లోని నీలోఫర్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌లోని ఎంజీఎం సహా చాలా హాస్పిటళ్లలో పిల్లల వార్డుల్లో బెడ్లు ఫుల్ అయ్యాయి. నీలోఫర్‌‌‌‌‌‌‌‌లో ఒక్కో బెడ్డుపై ఇద్దరిని పడుకోబెట్టి ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. నిత్యం వేల మంది పిల్లలు అవుట్‌‌‌‌ పేషెంట్లుగా వచ్చి ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకుంటున్నారు. జ్వరం, దగ్గు, జలుబుకు తోడు చాలా మంది పిల్లలు న్యుమోనియా సింప్టమ్స్‌‌‌‌తో వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన జ్వరం, పొడి దగ్గు, గురక వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులు, అపరిశుభ్ర పరిసరాల వల్ల బ్యాక్టీరియా, వైరస్‌‌‌‌లు సోకడం వల్ల న్యుమోనియా బారిన పడుతుండొచ్చని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌‌‌‌లో పిల్లల్లో న్యుమోనియల్ డిసీజెస్ రావడం సహజమే అయినప్పటికీ, ఈసారి కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

బెడ్లు చాలక తిప్పలు..
పేషెంట్ లోడ్ ఎక్కువగా ఉండడంతో పిల్లలు, వారి తల్లిదండ్రులకు తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రంలో ఉన్న ఏకైక పిల్లల దవాఖాన నీలోఫర్‌‌‌‌‌‌‌‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బెడ్డు దొరకడమే గగనంగా మారిపోయింది. ఒక్కో బెడ్డుపై ఇద్దరు ముగ్గురిని ఉంచి ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. ఎమర్జెన్సీ బ్లాక్‌‌‌‌లోని ఐదు ఫ్లోర్లలో ఉన్న వార్డులన్నీ ఫుల్ అయిపోయాయి. వీలైనంత మేరకు బెడ్లను అడ్జస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇతర హాస్పిటళ్లకు రిఫర్ చేస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు, పేషెంట్‌‌‌‌ లోడుకు అనుగుణంగా శానిటేషన్ వ్యవస్థ పని చేయడం లేదు. బాత్రూమ్‌‌‌‌లు అన్ని కంపు కొడుతున్నాయి. వార్డుల్లోని చెత్త రోజూ తొలగించకపోవడంతో కంపు కొడుతోందని పేషెంట్ల అటెండెంట్లు చెబుతున్నారు.

జిల్లాల నుంచి భారీ క్యూ..
నీలోఫర్‌‌‌‌‌‌‌‌లో బెడ్లు దొరక్క జిల్లాల నుంచి వచ్చే పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. రెస్పిరేటరీ సమస్యలు పెరగడంతో జిల్లాల నుంచి సిటీకి వచ్చే పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆయా జిల్లాల్లో దవాఖాన్లు ఉన్నప్పటికీ శ్వాస సమస్యలు ఉంటే వెంటనే నీలోఫర్‌‌‌‌‌‌‌‌కు రిఫర్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ పేషెంట్ల సంఖ్య ఎక్కువై డాక్టర్లు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. పేషెంట్ల లోడుకు తగ్గట్టు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సరైన ఏర్పాట్లు చేయడం లేదు. నీలోఫర్ హాస్పిటల్‌‌‌‌లో వార్డులు, విభాగాలు, టెస్టింగ్ సెంటర్లు, శాంపిళ్ల కౌంటర్లు ఎక్కడున్నాయో తెలియక జనాలు అవస్థలు పడుతున్నారు. కనీసం హెల్ప్‌‌‌‌​డెస్క్‌‌‌‌లు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో టెస్టుల కోసం చిన్నారులను పట్టుకొని రెండు బిల్డింగ్‌‌‌‌ల చుట్టూ తల్లిదండ్రులు తిరుగుతున్నారు. హెల్ప్‌‌‌‌ డెస్క్‌‌‌‌లను ఏర్పాటు చేయడంతో పాటు బెడ్ల సంఖ్యనూ పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.