బీసీ జనగణనను మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదు : వినయ్ భాస్కర్

బీసీ జనగణనను మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదు : వినయ్ భాస్కర్

బీసీ నాయకుడు ప్రధానమంత్రి అయ్యాక బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతారని అనుకున్నామని, కానీ.. తాము పెట్టుకున్న ఆశలన్నీ ఆడియాశలయ్యాయని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. బీసీ ప్రధానిగా మోడీ ఉండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. బీసీల వర్గాలకు మోడీ సర్కార్ అన్యాయం చేస్తోందన్నారు. బీసీ జనగణన చేయాలని డిమాండ్ ఉన్నా.. కేంద్ర ప్రభుత్వానికి కనీసం పట్టింపు కూడా లేదన్నారు. అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, ఇవాళ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరుతూ.. 2004లో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఓబీసీ నాయకుల బృందం నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలిసిందని చెప్పారు. 

దేశంలోని ఏ రాష్ట్రాల్లో లేని విధంగా బీసీలకు మెరుగైన విద్యను కేసీఆర్ ప్రభుత్వం అందిస్తోందని వినయ్ భాస్కర్ అన్నారు. బీసీలకు, బీసీ కుల వృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంపై బీసీ సంఘాల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. బీజేపీలో ఓబీసీ సెల్ ఉందని, ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ ప్రధాని మోడీపై ఒత్తిడి తేవాలన్నారు. టీఆర్ఎస్ లో ఉన్న బీసీ నాయకులపై ఈడీ, ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణ మోడల్ ను దేశంలోని బీసీలు కోరుకుంటున్నారని తెలిపారు.