జొన్నల కొనుగోలుకు సర్కారు సన్నాహాలు

జొన్నల కొనుగోలుకు సర్కారు సన్నాహాలు
  • మొత్తం 1,109 కోట్లు అవసరమన్న మార్క్‌‌‌‌ఫెడ్
  • మే 4న కేబినెట్ భేటీ తర్వాత అధికారిక నిర్ణయం
  • ఇప్పటికే మద్దతు ధరతో కొనుగోలుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సాగైన జొన్నల కొనుగోలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మార్క్‌‌‌‌ఫెడ్ ఆధ్వర్యంలో మద్దతు ధరకు కొనుగోళ్లు చేపట్టేందుకు సీఎం రేవంత్ ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలపగా.. మే 4న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ యాసంగి సీజన్‌‌‌‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.68 లక్షల ఎకరాల్లో జొన్న సాగు జరిగింది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం.. మొత్తం 3.68 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

ప్రధానంగా ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, మెదక్, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో జొన్న సాగు విస్తృతంగా జరిగింది. అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లాలో లక్ష ఎకరాల్లో జొన్న సాగైంది. కామారెడ్డి 87వేల ఎకరాల్లో,  సంగారెడ్డిలో 60 వేల ఎకరాలు,  నిర్మల్ లో41వేల ఎకరాలు,  వికారాబాద్​ జిల్లాలో 14వేల ఎకరాలు, ఆసీఫాబాద్​ జిల్లాలో 12వేల ఎకరాల్లో పంట సాగైంది.కేంద్ర ప్రభుత్వం జొన్న క్వింటాల్‌‌‌‌కు రూ.3,699 మద్దతు ధర నిర్ణయించినప్పటికీ.. బహిరంగ మార్కెట్‌‌‌‌లో వ్యాపారులు రూ.1,800 నుంచి రూ.2,180 కే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు క్వింటాల్‌‌‌‌కు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు నష్టపోతున్నారు.

ప్రైవేటు వ్యాపారులు నాణ్యత ఆధారంగా రూ.2 వేలలోపే ధరలకు పరిమితం కావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పంట కోతలు పూర్తయ్యి ధాన్యం కల్లాల్లోనే ఉండటంతో అకాల వర్షాల భయం కూడా రైతులను వెంటాడుతున్నది. మరో వైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఆలస్యం కావడంతో కొందరు రైతులు గత్యంతరం లేక దళారులకు తక్కువ ధరకే పంటను అమ్ముకుంటున్నారు.

రూ.1,109 కోట్లు అవసరమని మార్క్​ఫెడ్​ ప్రతిపాదనలు

జొన్నల కొనుగోళ్ల కోసం మార్క్​ఫెడ్ సుమారు రూ.1,109 కోట్ల నిధులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. బ్యాంకు గ్యారంటీ లభించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తేనే తమకు నష్టాలు తప్పుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఒకటి, రెండు రోజుల్లోనే జొన్నల కొనుగోలు ప్రక్రియ పట్టాలెక్కే అవకాశం ఉంది.