
సంగారెడ్డి టౌన్, వెలుగు : పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్హాల్లో అటవీ హక్కులు చట్టాలు, అధికారులు, కమిటీల పాత్ర, బాధ్యతలు, పోడు భూముల సర్వే, మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయడంపై సంబంధిత ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం నిబంధనల మేరకు పోడు రైతులకు న్యాయం చేస్తామన్నారు. 2005 డిసెంబర్ 13 కు ముందు నుంచి సాగులో ఉన్నవారు అర్హులని తెలిపారు. పోడు భూముల సర్వే వేగవంతం చేయాలని సూచించారు. దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని, రిజెక్ట్ చేస్తే దానికి కారణాలు లిఖితపూర్వకంగా ఉండాలని తెలిపారు. జిల్లాలో 52 గ్రామపంచాయతీలలో 7109 ఎకరాలకు సంబంధించి 3934 క్లెయిమ్స్ వచ్చాయన్నారు.
రెవెన్యూ, పంచాయతీ రాజ్, అటవీశాఖలను సమన్వయం చేసుకుంటూఎంపీడీవోలు గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కమిటీలలో తీర్మానాలను, రిజిస్టర్లలో పక్కాగా నమోదు చేయాలని చెప్పారు. అటవీ, రెవెన్యూ అధికారులు క్షేత్ర పర్యటనకు వెళ్లినప్పుడు ఎఫ్ఆర్సీ కమిటీకి, దరఖాస్తుదారులకు సమాచారం అందించాలన్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, బీట్ అధికారి క్షేత్ర సర్వే బృందం ప్రతి దరఖాస్తునూ పరిశీలించి మొబైల్ యాప్ లో వివరాలు అప్లోడ్ చేయాలని సూచించారు. గ్రామపంచాయతీల వారీగా దరఖాస్తులను పరిశీలనకు తేదీలను ఖరారు చేసి సర్వే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఎఫ్ ఆర్సీ కమిటీని సర్వేలో భాగస్వాములను చేయాలని చెప్పారు.
సర్వే సందర్భంలో ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తుదారుల నుంచి సేకరించాలని, కనీసం రెండు ధ్రువ పత్రాలు ఉండేలా చూసుకోవాలన్నారు. మొబైల్ యాప్ లో వివరాలను నమోదు చేయడాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి మోహన్ రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, అటవీశాఖ అధికారులు, డీఎల్ పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.