
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. 2025–26 విద్యాసంవత్సరానికిగానూ ఫస్టియర్లో 94,155 మంది విద్యార్థులు చేరారు. గతేడాదితో పోలిస్తే ఏకంగా 10 వేలకు పైగా అడ్మిషన్లు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 430 జూనియర్ కాలేజీలు ఉండగా, ఈ విద్యాసంవత్సరం జనరల్ కోర్సుల్లో 71,081 మంది చేరారు.
ఒకేషనల్ కోర్సుల్లో 23,074 మంది చేరారని అధికారులు తెలిపారు. కాగా, గతేడాదితో పోలిస్తే 278 కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగాయి. అత్యధికంగా మహబూబ్ నగర్ గర్ల్స్ కాలేజీలో 1159 మంది చేరగా, హైదరాబాద్ జిల్లా బండ్లగూడ కాలేజీలో 562, నాంపల్లి మోడల్ జూనియర్ కాలేజీ 956 మంది చేరారు. ఇక అత్యల్పంగా ఖమ్మం జిల్లా వేంసూర్ జూనియర్ కాలేజీలో 20, కామేపల్లిలో 31 మంది, జయశంకర్ జిల్లా కాటారం కాలేజీలో 37 మంది చేరారు.