
లీడర్లు, రియల్టర్లు...సర్కారు జాగలను పొతం పెడుతున్రు
మంచిర్యాల,వెలుగు : మంచిర్యాల జిల్లాలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములు పరాధీనం అవుతున్నాయి. అసైన్డ్, సీలింగ్, సింగరేణి స్థలాలతో పాటు చెరువు శిఖం భూములు కబ్జాదారుల పాలవుతున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు నస్పూర్, చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, కాసిపేట, మందమర్రి, తాండూర్ మండలాల్లో కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఆయా ప్రాంతాల్లో వందల ఎకరాల్లో అసైన్డ్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఖాళీగా ఉండడం, హైవేల నిర్మాణంతో గతంలో లక్షలు పలికిన భూముల రేట్లు ఇటీవల కోట్లకు పెరగడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, చోటామోటా లీడర్లు తెరవెనుక ఉండి భూదందాలు నడిపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతికి అలవాటుపడ్డ కొంతమంది అధికారులు వారికి వంతపాడుతూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇప్పటికే మంచిర్యాలలోని 324, 345 సర్వేనంబర్లలో, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 42, 64తో పాటు వివిధ సర్వేనంబర్లలో కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ ప్రాంతంలో గజానికి రూ.15వేలకు పైగా పలుకుతుండగా, హైవేను ఆనుకొని ఉన్న భూములకు రూ.50 వేల పైమాటే. కళ్లముందే కబ్జాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మీడియాలో కథనాలు వస్తేనో, ఫిర్యాదులు వస్తేనో తప్ప స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల అడిషన్ కలెక్టర్లు మధుసూదన్ నాయక్, రాహుల్ రంగంలోకి భూకబ్జాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ సంతోష్ ప్రభుత్వ భూముల పరిరక్షణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
కబ్జాలపర్వం ఇలా...
* తాండూర్ మండలం రేచిని రైల్వేస్టేషన్ దగ్గరలోని సర్వేనంబర్ 612లో 20 గుంటల ప్రభుత్వ భూమిని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో ఆక్రమించారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ స్వయంగా రంగంలోకి దిగి ఆక్రమణదారులు వేసిన సిమెంట్ స్తంభాలను రెవెన్యూ సిబ్బందితో తొలగించారు. అది ప్రభుత్వ భూమి అని, ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు.
* మందమర్రిలో 1/70 యాక్ట్‌కు అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులే తూట్లు పొడుస్తున్నారు. అసైన్డ్, సీలింగ్, సింగరేణి, సర్కారు భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారు. నేషనల్ హైవే 363కు రెండువైపులా పిట్టగూళ్లలాంటి షెడ్లు కట్టి మున్సిపాలిటీ నుంచి అడ్డదారిలో హౌస్ నంబర్లు పొంది అమాయకులకు అమ్ముతున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో బాండ్ పేపర్లు, తెల్లకాగితాలపై లావాదేవీలు సాగిస్తున్నారు.
* మంచిర్యాల ఏసీసీ క్వారీ రోడ్డులోని సర్వేనంబర్ 140లో 9.14 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టణానికి చెందిన ఓ కూరగాయల కమీషన్ ఏజెంట్ తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జా చేశాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి అందులో పంటలు పండిస్తున్నాడు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చినా, అధికారులకు ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదు. రాముని చెరువు, పోచమ్మ చెరువు, సాయికుంట చెరువు, భూదాన్‌బోర్డు భూములు కబ్జా అయ్యాయి.
* హాజీపూర్ మండలం వేంపల్లి శివారులోని 210 సర్వే నంబర్లో రెండెకరాల గవర్నమెంట్ ల్యాండ్ చుట్టూ కొంతమంది హద్దులు ఏర్పాటు చేసి అందులో కట్టడాలు మొదలుపెట్టారు. పంచాయతీ సెక్రటరీ ప్రతిభ తహసీల్దార్ రాజలింగు దృష్టికి తీసుకెళ్లడంతో సర్వే చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. హద్దురాళ్లను తొలగించి చుట్టూ ట్రెంచ్‌లు కొట్టించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
* మంచిర్యాల జిల్లాకేంద్రంలోని సాయికుంట చెరువులో అభివృద్ధి పనుల మాటున కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. సర్వేనంబర్లు 629, 630లో 9.7 ఎకరాల్లో చెరువు విస్తరించి ఉంది. చెరువు కబ్జా కాకుండా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు గతంలో వేసిన సిమెంట్ స్తంభాలను తొలగించారు. చెరువు అభివృద్దిలో భాగంగానే మధ్యలో నుంచి రోడ్డు వేశామని, బౌండరీలు తొలగించామని చెప్తున్నా కబ్జాలో భాగంగానే తొలగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌కు ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సంజీవని హనుమాన్ టెంపుల్ భూములను కొంతమంది కబ్జా చేశారు. సుమారు రెండెకరాల్లో అక్రమంగా పది ఇండ్లు కడుతున్నారు. ఎండోమెంట్ అధికారులు కంప్లైంట్ చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు హౌస్నంబర్లు కేటాయించారు. ఇక్కడ ఎకరం సుమారు రూ.10 కోట్లు పలుకుతోంది.
* బెల్లంపల్లి పాలిటెక్నిక్ సమీపంలోని 170 పీపీ ల్యాండ్‌లో కొంతమంది ఆరు ఎకరాలను ఆక్రమించారు. ఇక్కడ ఎకరం జాగ రూ.10 కోట్ల పైమాటే. కబ్జా విషయం అడిషనల్ కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు.
* చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ హైవే 63కు రెండు వైపులా కోట్ల విలువైన అసైన్డ్, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ లీడర్లు తెరవెనుక ఉండి కబ్జాల పర్వం నడిపిస్తున్నారు. గెర్రె కాలనీలో సర్వేనంబర్లు 843 నుంచి 855, 858, 859, 863, 869లలోని అసైన్డ్ భూములను తక్కువ రేట్లకు కొని ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. మున్సిపాలిటీలో ఉన్న పలుకుబడితో అక్రమంగా హౌస్నంబర్లు ఇప్పిస్తున్నారు. 869 సర్వేనంబర్‌లో మినీ స్టేడియానికి కేటాయించిన ఆరెకరాల భూమిలో అసైన్డ్‌దారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అడ్డుకునే నాథుడు కరువయ్యాడు.
* లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ శివార్లలో గల సబ్‌స్టేషన్ దగ్గర 375 సర్వేనంబర్‌లో ఆరెకరాల స్థలాన్ని 1978లో టీఎన్జీవోలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించారు. మౌలిక వసతులు లేకపోవడం, కోర్టు కేసుల కారణంగా ఈ జాగ ఖాళీగా ఉండడంతో కొంతమంది రియల్టర్లు, లీడర్లు కన్నేశారు. అయిదారుల లక్షలకు గుంట చొప్పున పేదలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.
* బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారులోని 45 సర్వేనంబర్‌లో 3.11 ఎకరాల్లో ఎర్రకుంట చెరువు ఉంది. దాని ఎఫ్టీఎల్ 11.06 ఎకరాలు. నేషనల్ హైవే 363కు సమీపంలో ఉన్న ఈ భూమిలో రూలింగ్ పార్టీ లీడర్ల అండతో పట్టణానికి చెందిన ఓ బడా రియల్టర్ రాత్రికి రాత్రే మట్టిపోశాడు. ప్రస్తుతం ఇక్కడ ఎకరాకు రూ.2 కోట్లకు పైగా పలుకుతోంది. ఆ పక్కనే 60 సర్వేనంబర్‌లో ఉన్న 77 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్‌ను ఆక్రమించుకునేందుకు పావులు కదుపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పోచమ్మ చెరువు సమీపంలోని ప్రభుత్వ భూములు కబ్జాదారుల పాలవుతున్నాయి.
* నస్పూర్ మున్సిపాలిటీలో పరిధిలోని 126 సర్వేనంబర్‌లో గల చెరువు శిఖం భూమిని అక్రమించుకునేందుకు స్థానిక నాయకుల అండతో రియల్టర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైయివేటు భూముల్లో వెంచర్లు చేసి ఆ డాక్యుమెంట్లతోనే శిఖం భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు. కోట్ల విలువైన భూములు కబ్జాపాలవుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.