ప్రజలు అడిగిన సమాచారం సర్కారు ఇచ్చి తీరాల్సిందే ..ఇందిరమ్మ ఇండ్ల వివరాలపై హైకోర్టు ఉత్తర్వులు

ప్రజలు అడిగిన సమాచారం సర్కారు ఇచ్చి తీరాల్సిందే ..ఇందిరమ్మ ఇండ్ల వివరాలపై హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: ప్రజలు అడిగిన సమాచారం ప్రభుత్వం ఇచ్చి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్‌‌‌‌కు ఇందిరమ్మ ఇండ్ల వివరాలు ఇవ్వాలని తేల్చిచెప్పింది. వివరాలు ఇచ్చేందుకు నిరాకరించడం సమాచార హక్కు చట్టం –2005కు పూర్తి విరుద్ధమని తప్పుపట్టింది. పిటిషనర్‌‌‌‌కు బీపీఎల్‌‌‌‌ కింద ఉచిత సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.

 మహబూబాబాద్‌‌‌‌ జిల్లా నర్సింహులపేటలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా, అర్హతలు, ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలంటూ పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులకు న్యాయ విద్యార్థి గాడిపెళ్లి గణేశ్‌‌‌‌ సమాచార హక్కు చట్టం కింద అప్లికేషన్‌‌‌‌ పెట్టుకున్నారు. 

బీపీఎల్‌‌‌‌ కేటగిరీలోని సమాచారాన్ని సెక్షన్‌‌‌‌ 7(5) కింద ఇవ్వాలని కోరితే, ఇచ్చేందుకు ఆఫీసర్లు నిరాకరించారు. దీనిని సవాలు చేస్తూ గణేశ్‌‌‌‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేయగా జస్టిస్‌‌‌‌ టి. మాధవీదేవి ఇటీవల విచారించారు. చట్టప్రకారం ఉచితంగా సమాచారం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది వాదించారు. సమాచార హక్కు చట్టానికి విరుద్ధంగా అధికారులు వ్యవహరించారని తెలిపారు.

 ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జీవో నంబర్‌‌‌‌ 454 ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సర్కార్‌‌‌‌ జారీ చేసిన జీవో 454 ఈ కేసులో వర్తించదని పేర్కొన్నారు. బీపీఎల్‌‌‌‌ దరఖాస్తుదారునికి చట్టప్రకారం ఉచిత సమాచారం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని వివరించారు. పిటిషనర్‌‌‌‌ కోరిన వివరాలు ఉచితంగా ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.