మహిళల్లో ‘మిత్తి’ సంబురం..సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రూ.304 కోట్లు చెల్లింపు

మహిళల్లో ‘మిత్తి’ సంబురం..సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు  రూ.304 కోట్లు చెల్లింపు
  • సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు  రూ.304 కోట్ల వడ్డీ డబ్బులు చెల్లింపు
  • జిల్లాల్లో పండుగలా కార్యక్రమాలు..ప్రభుత్వానికి మహిళల కృతజ్ఞతలు
  • రూ.3వేల కోట్లకుపైగా మిత్తి ఎగవేసిన గత బీఆర్​ఎస్​ సర్కార్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వడ్డీలేని రుణాలు తీసుకున్న గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం రూ.304 కోట్ల వ‌‌డ్డీ డబ్బులు విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 3,57,098 సంఘాల ఖాతాల్లో వీటిని జమ చేస్తున్నారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏటా రూ.25 వేల కోట్లకు తగ్గకుండా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే.

ఈ రుణాలపై  వడ్డీ భారం లేకుండా ప్రభుత్వమే మిత్తీ చెల్లిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మూడు విడతల్లో మహిళా సంఘాల ఖాతాల్లో రూ.1,118 కోట్ల మిత్తి పైసలను జమ చేసింది. ఇవిగాక మెప్మా పరిధిలోని మహిళా సంఘాలకు సుమారు రూ.300 కోట్ల వ‌‌‌‌‌‌‌‌డ్డీ చెల్లించింది. 

గత బీఆర్ఎస్ ​హయాంలో రూ.3వేలకోట్లకుపైగా పెండింగ్​

వడ్డీలేని రుణాలు తీసుకున్న మహిళలు వడ్డీతో సహా బ్యాంకుల్లో ముందుగా కిస్తీ చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన వారికి వడ్డీ పైసలను నాలుగైదు నెలలకోసారి లెక్కగట్టి ప్రభుత్వం సభ్యురాలి ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తుంది. కానీ, గత బీఆర్ఎస్​ సర్కార్ హయాంలో వడ్డీ లేని రుణాల పేరిట ఏటా రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల మేర ఇచ్చినప్పటికీ.. ఆ లోన్లకు సంబంధించిన వడ్డీ పైసలు మాత్రం జమ చేయలేదు. 

ఏకంగా రూ.3వేల కోట్లకు పైగా వడ్డీ ఎగవేసింది. ఈ క్రమంలో ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు నిధులను పారదర్శకంగా సకాలంలో అందజేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక లోన్లు తీసుకుంటున్నవారికి రెగ్యులర్ గా మిత్తి పైసలు జమ చేస్తున్నట్టు వెల్లడించారు. 

15 జిల్లాల్లో రూ.73.71 కోట్లు చెల్లింపు.. 

2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ లేని రుణాలకు (వీఎల్ఆర్) వడ్డీ చెల్లించేందుకు సర్కారు నిధులు కేటాయించింది. మంగళవారం 15 జిల్లాల్లోని 53 నియోజకవర్గాల పరిధిలో 90,882 సంఘాలకు రూ.73.71 కోట్లు చెల్లించింది. అత్యధిక మహిళా సంఘాలు, ఎక్కువ నిధులు పొందుతున్న నియోజకవర్గంగా నిర్మల్ జిల్లాలోని ముథోల్ నిలిచింది.  

ఇక్కడి  4,193 గ్రూపులకు రూ. 4.11.45 కోట్లు  విడుదల చేసింది. ఆ తర్వాత వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో 4,006 గ్రూపులకు రూ.3.39 కోట్లు చెల్లించింది.

విస్తరాకుల ఇండస్ట్రీ పెడుతున్నం

పాత కొమ్ముగూడెంలో బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.12 లక్షలు అప్పు తీసుకుని.. మోదుగు ఆకులతో విస్తర్లు తయారు చేసే ఇండస్ట్రీ పెడుతున్నం. మిషిన్ కూడా ఆర్డర్ పెట్టినం. ఫారెస్ట్ నుంచి ఆకులు సేకరించి రెండు రోజులు ఆరబెట్టి మిషిన్​తో స్టిచ్చింగ్ చేసి విస్తర్లు అమ్ముతం. 

పేపర్ ప్లేట్స్​లో భోజనం చేయడం వల్ల అనారోగ్యం పాలవుతారని డాక్టర్లు చెప్తున్నారు. అందుకే విస్తరాకుల ఆలోచన చేశాం. ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలేని లోన్లు ఇవ్వడం వల్ల మహిళకు ఎంతో మేలు జరుగుతుంది.

- దనిశెట్టి భూమక్క, బ్రహ్మంగారి గ్రామైక్య సంఘం, లక్సెట్టిపేట, మంచిర్యాల

చాలా హ్యాపీగా ఉంది.. 

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించడం చాలా హ్యాపీగా ఉంది.   ఒక్కొక్క సంఘానికి రూ.20 లక్షలు మంజూరు కావడంతో ఒక్కొక్క సభ్యురాలు రూ.రెండు లక్షల వరకు వడ్డీ లేని రుణం తీసుకొని సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి చెందేందుకు మంచి అవకాశం. మాజీ సీఎం వైఎస్సార్ హయాంలో వడ్డీ లేని రుణాలు ఇచ్చారని మా పేరెంట్స్ చెబితే విన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం సంతోషంగా ఉంది.

- సుజాత, పొనుగోడు జీవన్ సంఘం, నల్గొండ జిల్లా

సీఎంకు కృతజ్ఞతలు 

వడ్డీలేని రుణాల వల్ల  రాయికల్ మండలంలో 787 సంఘాలకు రూ.11 కోట్ల లాభం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. మహిళా సంఘాల సభ్యులకే కాకుండా సభ్యులు కానివారికి కూడా చీరలు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది.  

- బోధనపు సమత, అల్లీపూర్ గ్రామం, రాయికల్ మండలం. జగిత్యాల జిల్లా

వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటం.. 

మహిళా సంఘంలో చేరక ముందు ఎక్కడా అప్పు పుట్టేది కాదు. ఇప్పుడు బ్యాంకు నుంచి రూ.4 లక్షలు లోన్ తీసుకున్నాను. గోదావరిఖనిలో రెడీమేడ్ బట్టల షాపు, ఇందారంలో టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నా. ఈఎంఐ పోను నెలకు రూ.15 వేల  ఆదాయం వస్తుంది. గత  బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వలేదు. సీఎం రేవంత్ రెడ్డి మహిళకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి అభివృద్ధికి అండగా నిలుస్తున్నారు.

- గడ్డం రాజేశ్వరి, ఇందారం గ్రామం, జైపూర్, మంచిర్యాల జిల్లా

కాంగ్రెస్​ వచ్చాక రెండోసారి వడ్డీ పైసలు 

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలివ్వడం కాంగ్రెస్​ వచ్చిన తర్వాత ఇది రెండోసారి. ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి రెండు సార్లు వడ్డీలేని రుణాలివ్వడం పట్ల సంతోషంగా ఉంది. ప్రతి పేద మహిళ వ్యాపారం చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం.  

- సత్తవ్వ, అన్నపూర్ణ మండల సమాఖ్య అధ్యక్షురాలు, లక్ష్మీపూర్ గ్రామం, జగిత్యాల

సొంతంగా ఎదిగేందుకు మంచి అవకాశం 

బయట వ్యక్తులు 3, 4 రూపాయలు వడ్డీలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న వడ్డీ లేని రుణాల వల్ల ఒక్కొక్క సభ్యురాలికి  రూ. 2 లక్షల రుణం రావడంతో సొంతంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల మహిళలు అభివృద్ధి సాధిస్తారు. లోన్​రెగ్యులర్ గా  కట్టుకుంటే కుటుంబంలో ఏవైనా అవసరాలు ఉన్నప్పుడు ఎక్కువ లోన్​ తీసుకునే అవకాశం ఉంటుంది.

- కవిత, లింగంపల్లి, నల్గొండ జిల్లా

గత పదేండ్లలో పైసా రాలేదు 

గత బీఆర్ఎస్ సర్కారు​పదేండ్ల పాలనలో మహిళా సంఘాల బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీ పైసా కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించడం సంతోషకరం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పెద్దపీట వేయడం అభినందనీయం.

- కొట్టే కవిత, మహిళా సంఘం సభ్యురాలు, కొత్తపల్లి, నల్గొండ జిల్లా