టీచర్లకు ట్యాబ్‌లు ఎప్పుడిస్తరు?

టీచర్లకు ట్యాబ్‌లు ఎప్పుడిస్తరు?

టీచర్లకు ట్యాబ్‌లు ఎప్పుడిస్తరు?
ఇంకా టెండర్ దశలోనే ప్రక్రియ  

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని సర్కారు ప్రైమరీ స్కూల్ టీచర్లకు ట్యాబ్‌లు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. గతేడాది ఏప్రిల్-లో జరిగిన సమగ్ర శిక్షా అభియాన్, ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్(పీఏబీ) సమావేశంలో టీచర్లకు ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ప్రక్రియ టెండర్ల దగ్గరే ఆగిపోయింది. దీంతో కొత్త విద్యాసంవత్సరానికి కూడా టీచర్లకు ట్యాబ్‌లు అందడం కష్టంగానే కనిపిస్తోంది. దీనికి తోడు కేంద్రం 34 వేలకు పైగా ట్యాబ్‌లు అందజేయాలని ఆదేశిస్తే..రాష్ట్ర ప్రభుత్వం వాటిని కేవలం20 వేలకు కుదించడం విమర్శలకు తావిస్తోంది.

ఆలస్యంగా స్టార్ట్ అయిన ప్రాసెస్

రాష్ట్రంలో 18,233 ప్రైమరీ స్కూల్స్ ఉండగా, వీటిలో 17,810 స్కూళ్లలో మాత్రమే పిల్లలున్నారు. ఈ స్కూళ్లల్లో మొత్తం 42 వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారిలో 34,257 మందికి ట్యాబ్‌లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఒక్కో ట్యాబుకు రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ లెక్కన 34,257 మందికి రూ.34.25 కోట్లు ఇస్తామని ప్రకటించింది. కేంద్రం తన వాటా కింద 60 శాతం ఇస్తే, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కేంద్రం తనవాటా డబ్బులను కూడా ఇచ్చినట్టు సమాచారం.  స్కూళ్లు ప్రారంభమైన వెంటనే ట్యాబ్‌లు కొనుగోలుపై దృష్టిసారించాల్సిన రాష్ట్ర అధికారులు ఆలస్యంగా ప్రక్రియ ప్రారంభించారు. కేవలం 20వేల ట్యాబ్‌లకే టెండర్ ఇచ్చినప్పటికీ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదు. కేవలం టెక్నికల్ బిడ్ మాత్రమే ఓకే అయినట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దాన్ని సర్కారు ఉన్నతాధికారులు ఒకే చేస్తే.. ఫైనాన్షియల్​ బిడ్ కు పోవాల్సి ఉంటుంది. కాని అందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో  టీచర్లకు ట్యాబ్‌లు అందజేసే ప్రక్రియ ముందుకు కొనసాగడం లేదు. 

14,257 ట్యాబ్‌లు తగ్గింపు

కేంద్రం ఇచ్చిన డబ్బుతో ఎన్ని ట్యాబ్‌లు వస్తాయో వాటినే కొనుగోలు చేసి టీచర్లకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో కేంద్రం అనుమతించిన 34,257 కు కాకుండా కేవలం 20వేలకు మాత్రమే అధికారులు టెండర్లు పిలిచారు.14,257 ట్యాబ్‌లను తగ్గించారు. మంచి ఫీచర్స్, సిమ్ తో కూడిన ట్యాబ్‌లకు రేటు ఎక్కువ ఉండటంతో సంఖ్యను తగ్గించినట్లు అధికారులు చెబుతున్నారు. తక్కువ విద్యార్థులు ఉన్న స్కూల్​కు ఒక్కోటి చొప్పున అందించి, మిగిలిన వాటిని ఎక్కువ స్టూడెంట్లు ఉన్న స్కూళ్లకు అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్రం ఆమోదం తెలిపిన అన్ని ట్యాబ్‌లను ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. అందుకు అయ్యే అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కోరుతున్నాయి.