గుండాలకు నవాబ్‌ పేట నుంచి నీళ్లిస్తాం : బీర్ల అయిలయ్య

గుండాలకు నవాబ్‌ పేట నుంచి నీళ్లిస్తాం : బీర్ల అయిలయ్య

మోత్కూరు, వెలుగు:  గుండాల మండలానికి నవాబ్ పేట రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చెప్పారు. మంగళవారం గుండాల మండలం బండకొత్తపల్లి, వస్తాకొండూర్, పెద్దపడిశాల, తుర్కలశాపురం, అంబాల, నూనెగూడెం, సీతారాంపురం, వెల్మజాల, అనంతారం గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్ నుంచి వచ్చే కాల్వలో పెరిగిన గడ్డిని క్లీన్ చేయించేందుకు ఈఎన్సీ, ఇరిగేషన్ ఎస్ఈతో మాట్లాడినట్టు తెలిపారు. 

వేసవిని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి లేకుండా మండలానికి రూ.25 లక్షలు కేటాయించానన్నారు. జనగాం జిల్లా నుంచి మండలానికి వచ్చే మిషన్ భగీరథ నీటిలో లోపాలు లేకుండా చూడాలని  అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, ఎంపీపీ తాండ్ర అమరావతి, లీడర్లు ఈరసరపు యాదగిరి, ఏలూరి రాంరెడ్డి, ఎంపీటీసీ కార్న నరేష్, ద్యాప కృష్ణారెడ్డి, అనితాదేవి, పొన్నగాని నారాయణ తదితరులు పాల్గొన్నారు.