అధికారులకు రాష్ట్ర సర్కారు ఆదేశం

అధికారులకు రాష్ట్ర సర్కారు ఆదేశం
  • 125 ఎకరాలు.. 3 నెలల్లో అమ్మేద్దాం
  • అధికారులకు రాష్ట్ర సర్కారు ఆదేశం
  • ఆజామాబాద్​, బాలానగర్ కోఆపరేటివ్, హఫీజ్​పేట్ మినీ ఇండస్ట్రియల్ 
  • ఎస్టేట్స్​లో జాగాలు 2,900 కోట్ల రూపాయల
  • ఆదాయం అంచనా డిసెంబర్ 15 డెడ్ లైన్ 
  • ఒరిజినల్ అలాటీస్​తో పాటు ఇతరులకూ  విక్రయించేందుకు ప్లాన్​

ఆజామాబాద్​, బాలానగర్​, హఫీజ్​పేట్ భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ.2,849 కోట్ల ఆదాయం వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఒరిజినల్ అలాటీస్​కు అమ్మితే రూ.1,627.54 కోట్లు, ఇతరులకు విక్రయించడం ద్వారా రూ.1,221.73 కోట్లు వస్తుందని భావిస్తోంది. ఆజామాబాద్​లో రిజిస్ట్రేషన్​ విలువ గజానికి రూ.43,500 ఉన్నది. హఫీజ్​పేట్​లో రూ.26,500, బాలానగర్​లో గజానికి రూ.23 వేలు ఉంది. ఆ ప్రకారం ఒరిజినల్ అలాటీస్​కు అమ్మేలా ప్లాన్ చేశారు. ఇతరులకు రిజిస్ట్రేషన్ వాల్యూకు డబుల్ చేసి అమ్మనున్నారు. ఒకవేళ ఒరిజినల్ అలాటీస్ ఎవరైనా వద్దు అనుకుంటే ఇతరులకు డబుల్ రేటుకే విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. నాన్ ఒరిజినల్ అలాటీస్​కు విక్రయంపై ఇంకింత ఆదాయం ఎలా సమకూర్చుకోవాలనే దానిపై ప్రభుత్వం మార్గాలు వెతుకుతోంది.

హైదరాబాద్, వెలుగు:ఇండస్ట్రీలకు గతంలో కేటాయించిన భూము లను అమ్మేందుకు రాష్ట్ర సర్కార్​ సిద్ధమైంది. ఆజామాబాద్​తోపాటు బాలానగర్ కో ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, హఫీజ్ పేట్ మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్​ ల్యాండ్స్ అమ్మాలని నిర్ణయించింది. ఆజామాబాద్​కు సంబంధించి ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయగా.. బాలానగర్, హఫీజ్​పేట్​కు సంబంధించి నేరుగా కేబినెట్ నిర్ణయంతో అమ్మనున్నారు. డిసెంబర్ 15వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భూములు అలాట్ అయి ఉన్నవారికి మార్కెట్ విలువ ప్రకారం, ఇతరులకు మార్కెట్ రేటులో డబుల్​కు ఇస్తే ఏ మేరకు ఆదాయం వస్తుందనే దానిపై ప్రభుత్వం ప్రాథమిక లెక్కలు వేసుకున్నది. దీని ప్రకారం ఈ మూడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో 6.06 లక్షల గజాలు(దాదాపు 125 ఎకరాలు) అమ్మకానికి రెడీగా ఉన్నాయి. దీంతో రూ.2900 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇది లా ఉండగా గతంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఎక్కడెక్కడ ఎంత భూమి కేటాయించారు ? వాటిల్లో ఏం యూనిట్లు నడుస్తున్నాయి? ప్రస్తుత పరిస్థితి ఏంటి? అనే దానిపై సర్కారు రిపోర్టులు తెప్పించుకుంది. ఆ లెక్కన ఇండస్ట్రీలకిచ్చిన భూములను దశలవారీగా ప్రభుత్వం అమ్మేయనుంది. 

మూడింటిలో ఒరిజినల్ అలాటీస్ 84 

ఆజామాబాద్, బాలానగర్​, హఫీజ్​పేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్​లో మొత్తం 355 యూనిట్లు ఉన్నాయి.  ఇందులో ఒరిజినల్ అలాటీస్​కు 84 యూనిట్లు ఉన్నయి. వీటి పరిధిలో 3.98 లక్షల చదరపు గజాలు ఉన్నట్లు గుర్తించారు. ఆజామాబాద్​లో 36 యూనిట్లకు 3.41 లక్షల చ.గజాల, హఫీజ్​పేట్ ఎంఐఈలో 21 యూనిట్లకు 25,249 చ.గజాలు, బాలానగర్ సీఐఈలో 27 యూనిట్లు 31,713 చ.గజాల భూమి ఉన్నది. రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా వీరికే అమ్మితే ఎంత ఆదాయం వస్తుందనే దానిపై లెక్కలు కట్టారు. వీటి పరిధిలో ఒరిజనల్ అలాటీస్ కాకుండా మరో 279 యూనిట్లు ఉన్నాయి. అధికంగా సీఐఈ బాలానగర్​లో 234 నాన్ ఒరిజినల్ అలాటీస్ ఉన్నారు. ఈ మొత్తం 2.07 లక్షల చ.గజాలు ఉంది. ఒకవేళ వీళ్లకు భూములను అమ్మితే రిజిస్ట్రేషన్ వాల్యూకు డబుల్ వసూలు చేయాలని ప్రభుత్వం  భావిస్తోంది.

చిక్కులు రాకుండా ప్రాసెస్​

మూడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లకు సంబంధించిన భూముల అమ్మకం మూడు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకున్నది. మంత్రులు కేటీఆర్, హరీశ్​రావుతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల సమావేశమై ఈ భూముల అమ్మకంపై సమీక్షించింది. నవంబర్ 1వ తేదీ కల్లా ప్రభుత్వం తరఫున ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాసెస్​ పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించింది. అప్లికేషన్ల స్వీకరణ కూడా అదే రోజు నుంచి ప్రారంభించాలని సూచించింది. డిసెంబర్ 1వ తేదీ కల్లా అప్లికేషన్లను ఫీల్డ్ వెరిఫై చేయాలని సర్కార్​  భావిస్తోంది. 15వ తేదీ కల్లా అప్లికేషన్ల అప్రూవ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత 90 రోజుల్లో చెల్లింపులు పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసుకున్నది.