రచనలూ చట్టాలను తెస్తాయి

రచనలూ చట్టాలను తెస్తాయి

రచయితల రచనల్లోని కోరిక వల్ల అభిప్రాయాల ఆధారంగా కూడా చట్టాలు వస్తాయి. అయితే, రచయితలు ఆ విధంగా రచనలు చేయాలి. కానీ, తెలుగులో కొద్దిమంది మాత్రమే అలాంటి రచనలు చేస్తున్నారు. 

చట్టాల ద్వారా పాలన

చాలామంది శాసనాలు, చట్టాలు అనగానే ఆమడదూరంలో ఉంటారు. మనం ఉదయం లేచిన దగ్గరి నుంచి నిద్రించేవరకు మనం చట్టాల ద్వారా పాలించబడుతున్నాం. నిర్బంధంలో ఉన్న వరవరరావు గురించి ఏవో  రెండు ప్రకటనలు ఇచ్చి చాలామంది చేతులు దులుపుకుంటున్నారు తప్ప దాన్ని కావల్సినంతగా కథల్లోకి, కవిత్వంలోకి మొత్తంగా సృజనలోకి తీసుకొనిరావడం లేదు. నేనా మధ్య రాస్తున్న కొన్ని క్రిటికల్ లీగల్ వ్యాసాలను చదివి ఓ ఇద్దరు, ముగ్గురు మిత్రులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘చాలా విషయాలని ఆర్ట్ రూపంలోకి తీసుకొని వస్తే ఎక్కువమందిని ఆకర్షిస్తాయని నువ్వంటావు కదా. ఆ పనిని ఇంకా  నువ్వు ఎక్కువ చేయవచ్చు కదా’ అని ఓ ఇద్దరు ఆత్మీయులు అన్నారు. నిజానికి ఆ పనిని నేను చాలాకాలంగా చేస్తున్నాను. అయితే వాళ్లు ఇంకా ఎక్కువగా అలాంటివి నా నుంచి కోరుకుంటున్నారని అనిపించింది.  సాహిత్యం చేసేపని సాహిత్యం చేస్తుంది. కొన్ని సాహిత్యంలో ఇమడకపోవచ్చు. ఇమిడే అవకాశం ఉన్నప్పుడు అలా చేయడమే సమంజసం. 

చట్టాలకు సాహిత్యం దోహదం

చట్టాలతో, కోర్టులతో, పోలీసులతో సంబంధం ఉన్నవాళ్లు రచయితలు అయినప్పుడు ఆ రచనల్లో వాస్తవికత ఎక్కువ ఉండవచ్చు. అయితే, మిగతా రచయితలు కూడా కొన్ని అంశాల మీద ఈ రచయితల కన్నా బాగా చెప్పగలరు. నిర్భయ గురించి, స్వేచ్ఛ గురించి, అకృత్యాల గురించి చెప్పడానికి, వ్యతిరేకించడానికి ఆ వ్యక్తి న్యాయవాదో లేదా న్యాయమూర్తో కావాల్సిన అవసరం లేదు. న్యాయవ్యవస్థతో సంబంధం ఉన్న రచయితలు ఉండవచ్చు. న్యాయవ్యవస్థ దరికి వచ్చిన రచయితలు ఉండవచ్చు. రాంగ్ రూట్లో వెళితే చాలు ఎవరికైనా చట్టంతో సంబంధం ఏర్పడుతుంది. మన అనుభవంలోకి వచ్చిన ఏ అంశాన్నైనా మనం కవిత్వీకరించవచ్చు. కథలో చూపించవచ్చు. నవలతో విశదీకరించవచ్చు. సాహిత్యం అనేది మంచి చట్టాలు రావడానికి ఉపయోగించవచ్చు. అణచివేసే చట్టాలని సాహిత్యం ద్వారా బహిరంగ పరచవచ్చు. చార్లెస్ డికెన్స్ కొంతకాలం ఓ న్యాయవాది దగ్గర అప్రెంటీస్ గా పని చేశాడు. ఎన్నో నవలలు రాశాడు. పారిశ్రామిక విప్లవం వల్ల జరిగే అనర్థాలని ఎన్నో తన నవలలలో చూపించాడు. ఆయన రచనల ప్రభావం వల్ల కొన్ని అంశాలమీద ప్రజాభిప్రాయం ఏర్పడి ప్రజలకు ఉపయోగపడే కొన్ని శాసనాలు వచ్చాయి. 

జాతివివక్షకు వ్యతిరేకంగా చట్టం

హరియట్ బీచర్ స్టోక్ రాసిన 'అంకుల్ టామ్స్ కాబిన్' లో ఆఫ్రికన్ అమెరికన్లు ఎదుర్కొంటున్న వేదనను బానిసత్వంలోని ఆవేదనని చూపించారు. ఫలితంగా బానిసత్వం రద్దయ్యే శాసనం వచ్చింది. ఈ నవల రాసిన పది సంవత్సరాల తరువాత ఆ రచయిత్రి అబ్రహం లింకన్ ను కలిసింది. అప్పుడు ఆయన ఆమెతో ఇలా అన్నారు. 'పెద్ద యుద్దానికి దారితీసిన ఆ నవలని రాసిన చిన్నమ్మాయివి నువ్వే నన్నమాట" అంటూ శుభాకాంక్షలు చెప్పారు.

చిన్న అంశాలకే దెబ్బతింటున్న మనోభావాలు

ఈ రోజుల్లో చిన్న చిన్న అంశాలకే వ్యక్తుల మనోభావాలు, వ్యవస్ధల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కేసులు దాఖలవుతున్నాయి. కేసులు కొట్టివేయబడుతున్నాయి. ఆ రెండింటి మధ్యలో ఆ వ్యక్తి పడిన వేదనని అంచనా వేయలేం. ఒక చిన్న కవిత, ఓ చిన్న ట్వీట్ కూడా కేసులు దాఖలు కావడానికి కారణం అవుతున్నాయి. ఇదీ ఇప్పుడు మనదేశంలోని పరిస్థితి. ఫేస్ బుక్ ని లైక్ చేస్తే స్కూలు పిల్లలని అరెస్టు చేసే పరిస్థితి, కార్టూన్ వేస్తే జైలుకి వెళ్ళే పరిస్థితి, కవిత రాస్తే ప్రాసిక్యూషన్ ని ఎదుర్కొనే స్థితి. ఈ స్థితే ఎప్పుడూ కొనసాగుతుందా? కొనసాగదు. ఎమర్జెన్సీ తరువాత మంచిరోజులు వచ్చాయి. ఏడియమ్ జబల్పూర్ కేసుని రద్దు చేస్తూ రాజ్యాంగంలో సవరణలు వచ్చాయి.

కె. శివశంకర్ పిళ్ళై నెహ్రూని విమర్శిస్తూ ఎన్నో కార్టూన్​లని వేశారు. రాజకీయ వ్యంగ్య చిత్రాలకి అతను పితామహుడని చెప్పవచ్చు.  అతను నెహ్రూకి వ్యతిరేకంగా లెక్కలేనన్ని కార్టూన్ లు వేశారు. నెహ్రూ చనిపోవడానికి కొన్ని వారాల ముందు ఆయన వేసిన కార్టూన్​ చూసి "నన్ను వదలాల్సిన పనిలేదు శంకర్" అని అన్నాడట. నెహ్రూ తన బలహీనతలని శంకర్ కార్టూన్ ద్వారా తెలుసుకునేవాడు. ఆ తరువాత ఇందిరాగాంధీ హయాంలో శంకర్ తన వీక్లీని మూసి వేశాడు. నెహ్రూలు, అబ్రహం లింకన్ లాంటి వ్యక్తులు ఉంటారు. ఉండకపోవచ్చు. మనిషి స్వేచ్ఛకి భంగం వాటిల్లినప్పుడు రచయితలు గొంతెత్తాలి. చట్టాలు మారినా, మారకపోయినా రాజీలేని రచనలని రచయితలుకొనసాగించాలి.

కొన్ని ఉదాహరణలు

జాతి వివక్షకి  వ్యతిరేకంగా నోబెల్ బహుమతి పొందిన నాడైన్ గోర్డిమర్ ఎన్నో రచనలు చేశారు. ఆమె రచనల మీద ఆంక్షలని కూడా విధించారు. మండేలా జైలు శిక్షని అనుభవించడానికన్నా ముందు కోర్టులో ఇచ్చిన ప్రసంగ ప్రతి ("నేను చావడానికి సిద్ధం")ని ముందుగా గోర్డిమర్ పరిశీలించింది. ఆమెను అనుసరించి ఇట్లా ఎంతోమంది రచనలు చేశారు. ఫలితంగా జాతివివక్షకి  వ్యతిరేకంగా 1986వ సంవత్సరంలో ఓ చట్టం వచ్చింది. ఆప్టన్ సింక్లేయర్ రాసిన జంగిల్ (1906) నవలలో ప్రవాస కార్మికుల వ్యధలని చెప్పారు. చికాగోలోని మాంస పరిశ్రమలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలని, పరిశుభ్రత లేని వాతావరణాన్ని ఆ నవలలో వివరించారు. దాంతో ఆహారాన్ని నియంత్రిస్తూ, పరిశుభ్రతని పాటించాలంటూ అమెరికాలో కొత్త చట్టం వచ్చింది. తెలుగులో కూడా ఇలాంటి సాహిత్యం వస్తుంది కానీ విమర్శకులు ఆ విషయాలని పట్టించుకున్నట్టుగా అనిపించడం లేదు. నవీన్ రాసిన 'చీకటి రోజులు' నవలని ఎంతగా పట్టించుకోవాలో అంతగా విమర్శకులు పట్టించుకోలేదని అనిపిస్తుంది.

నవలగా ఎమర్జెన్సీ అకృత్యాలు

ఎమెర్జెన్సీ కాలంలో పోలీసులు, రాజ్యం జరిపిన అకృత్యాలని నవలలో నవీన్ బట్టబయలు చేశారు. ఈ నవలని డైరీ మాదిరిగా నవీన్ రాశారు. రాజ్యం చేసిన అకృత్యాలని బట్టబయలు చేసిన నవలగా ‘చీకటి రోజులు’ అని పేర్కొనవచ్చు. ఇప్పుడు దేశంలో వున్న చీకటి రోజులని ప్రతిబింబించే విధంగా రచనలు చేయడానికి రచయితలు జంకుతున్నారని అనిపిస్తున్నది. ఈ పరిస్థితికి రచయితలని తప్పుపట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక్క మాట ఎవరిని అన్నా వారిపై దాడిచేసే పరిస్థితులు ఏర్పడినాయి. పత్రికలు పూర్తిగా ఏదో ఒక రాజకీయ పార్టీ పక్షంలో ఉండటం వల్ల మంచి సాహిత్యం రాకుండా పోతోంది. మన భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 295 ఎ వుంది. ఒక తరగతికి చెందిన మతం లేదా మతవిశ్వాసాలకు హాని కలిగించే ఉద్దేశ్యంతో అవమానించారని కేసులు పెట్టడం మామూలు విషయంగా మారిపోయింది.

ఓ రాజకీయ నాయకుడి మీద ఓ కార్టూన్ వేస్తే చాలు కేసు నమోదవుతుంది. ఆ రచయిత, ఆ కార్టూనిస్ట్  జైలుకెళ్ళిపోతాడు.  మరాఠీ కవి వసంత్ దత్తాత్రేయ గుర్ జార్ గాంధీజీ మీద ఓ వ్యంగ్య కవిత రాశాడు. అది తరుచూ పత్రికల్లో ప్రచురితం అవుతూ వస్తుంది. మొదటిసారి అది 1983లో ప్రచురితం అయ్యింది. ఆ కవితని చాలా మంది ప్రశంసించారు. సాహిత్య అకాడమీ ప్రచురించిన కవితా సంకలనంలో కూడా ఆ కవిత చోటు చేసుకుంది. 1994లో ఆయన మీద కేసు నమోదయ్యింది. చారిత్రక వ్యక్తులని ఆధారం చేసుకొని కవితలు, రచనలు చేయకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

చట్టాలనేవి మూడు రకాలుగా తయారవుతాయి. ప్రజల ఒత్తిడి మేరకు, ప్రభుత్వాల ఇష్టాల మేరకు, ప్రజల కోరిక మేరకు తయారవుతాయి. అదేవిధంగా సృజనకారుల అభిప్రాయం మేరకు కూడా కొన్నిసార్లు తయారవుతాయి. తయారుకావాలి. ప్రస్తుతం ఈ ప్రభావం తగ్గిపోయినట్టుగా అన్పిస్తుంది. ఇప్పుడు చట్టాలు ఎక్కువగా పాలకుల ఇష్టాల మేరకు తయారవుతున్నట్టు కన్పిస్తోంది. దేశంలో జరుగుతున్న రైతుల ధర్నాని గమనించినా, చాలా చట్టాలని గమనించినా అలాగే అనిపిస్తోంది. ప్రజల ఒత్తిడి కారణంగా కూడా ఆ మధ్య కాలంలో వచ్చిన చట్టం నిర్భయ చట్టం. ఈ చట్టం ద్వారా ఇండియన్ పీనల్ కోడ్ లో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్​లో కొన్ని ప్రధానమైన మార్పులు వచ్చాయి.

- డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్​)