నీలి రామచందర్ కు ‘ ప్రెసిడెంట్ అఫ్ ఇండియా గోల్డ్  మెడల్’

నీలి రామచందర్ కు ‘ ప్రెసిడెంట్ అఫ్ ఇండియా గోల్డ్  మెడల్’

 

 

  • తెలంగాణ వచ్చాక రాష్ట్రానికి ప్రెసిడెంట్ అఫ్ ఇండియా గోల్డ్ మెడల్ రావడం ఇదే తొలిసారి
     

హైదరాబాద్: రెడ్ క్రాస్ నిజామాబాద్ జిల్లా చైర్మన్ డాక్టర్ నీలి రామచందర్ కు బుధవారం రాజ్ భవన్ లో  గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్  "ప్రెసిడెంట్ అఫ్ ఇండియా గోల్డ్  మెడల్, " సర్టిఫికెట్ ను బహుకరించారు. రెడ్ క్రాస్ ద్వారా డాక్టర్ నీలి రామచందర్ చేసిన సేవలకు గుర్తింపుగా 2017-18 సంవత్సరానికి గాను ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ మెడల్ కు ఎంపికయ్యారు. కోవిడ్, లాక్‌డౌన్‌ పరిస్థితుల వలన ఢిల్లీలో  ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం వల్ల గవర్నర్ చేతుల మీదుగా ఆయనకు ఈ  గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ ను రాజ్ భవన్ లో ఈరోజు అందించారు.
దేశ ప్రజల సేవలో, జాతి సేవలో రెడ్ క్రాస్ నిరుపమానమైన సేవలందిస్తున్నదని ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ అఫ్ ఇండియా గోల్డ్ మెడల్ రావడం రాష్ట్రానికి ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన డాక్టర్ రామ్ చందర్ ను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణలో జనం దగ్గరకు వెళ్లి రెడ్  క్రాస్ సేవలను మరింత విస్తృతం చేయాలని ఈ సందర్భంగా డాక్టర్ తమిళిసై పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రెటరీ కె సురేంద్రమోహన్, రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రతినిధులు  మదన్ మోహన్ రావు, డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, ఈ వి శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ నిజామాబాద్ ప్రతినిధులు బుస్సా ఆంజనేయులు, తోట రాజశేఖర్  ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.