జీపీఎఫ్ వడ్డీరేటు తగ్గింది

జీపీఎఫ్ వడ్డీరేటు తగ్గింది

7.9 శాతానికి తగ్గించిన కేంద్రం

ముంబై : జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్), ఇతర సంబంధిత స్కీమ్‌‌లపై వడ్డీరేట్లను మోడీ ప్రభుత్వం స్పల్పంగా తగ్గించింది. గత 3 క్వార్టర్‌‌‌‌లలో 8 శాతంగా ఉన్న జీపీఎఫ్‌‌ వడ్డీరేటును, ప్రస్తుతం 0.1 శాతం తగ్గించింది. దీంతో జూలై–సెప్టెంబర్ కాలానికి జీపీఎఫ్‌‌ రేటు 7.9 శాతానికి దిగొచ్చింది. జీపీఎఫ్‌‌ అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే ప్రావిడెంట్ ఫండ్. ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనంలో కొంతభాగాన్ని దీని కింద జమచేస్తారు. 2019 జూలై 1 నుంచి 2019 సెప్టెంబర్ వరకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర సంబంధిత ఫండ్లపై వడ్డీరేటును 7.9 శాతంగా నిర్ణయిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2003కు ముందు లేదా ఆరోజు నియామకం అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ నిబంధనలు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, డిఫెన్స్ ఫోర్స్‌‌ల ప్రావిడెంట్ల ఫండ్స్‌‌పై ఈ తక్కువ చేసిన వడ్డీరేట్లు వర్తిస్తాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌‌కు అనుగుణంగా దీనిలో మార్పులున్నాయని తెలిసింది.

ఇతర సంబంధిత ఫండ్స్‌‌

కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్(ఇండియా), ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్, స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్(డిఫెన్స్ సర్వీసెస్), ఇండియన్ అర్డ్‌‌నెన్స్ డిపార్ట్‌‌మెంట్ ప్రావిడెంట్ ఫండ్, ఇండియన్ అర్డ్‌‌నెన్స్ ఫ్యాక్టరీస్ వర్క్‌‌మెన్ ప్రావిడెంట్ ఫండ్, ఇండియన్ నావల్ డాక్‌‌యార్డ్ వర్క్‌‌మెన్ ప్రావిడెంట్ ఫండ్, డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్, ఆర్మ్‌‌డ్ ఫోర్సస్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి ఇతర ఫండ్స్‌‌కు కూడా  ఈ రేటే వర్తించనుంది.