గర్భిణీలకు కేంద్రం గుడ్ న్యూస్

గర్భిణీలకు కేంద్రం గుడ్ న్యూస్
  • ఆఫీస్ కు హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు డీఓపీటీ ప్రకటన

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి సమయంలో గర్భిణీ ఉద్యోగులకు ఆఫీసుకు హాజరు నుంచి మినహాయింపునిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) విభాగం ప్రకటించింది. గర్భిణీలు, వికలాంగులు, కరోనా రెడ్ జోన్లలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫీసుకు హాజరు నుంచి మినహాయించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలను కోరినట్లు పర్సనల్, పబ్లిక్ గ్రీవియెన్స్ & పెన్షన్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం మీడియాకు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే సర్క్యులర్ జారీ అయిందని, వివిధ మంత్రిత్వ శాఖలతో పాటు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు అనుసరిస్తాయని భావిస్తున్నట్లు సింగ్ చెప్పారు. ఇప్పటికే ప్రసూతి సెలవులో లేని గర్భిణీ ఉద్యోగులను కూడా కార్యాలయానికి హాజరుకాకుండా మినహాయించనున్నట్లు వెల్లడించారు. లాక్​డౌన్​కు ముందు లేదా ప్రస్తుతం అనారోగ్యంతో ట్రీట్​మెంట్ పొందుతున్న ఉద్యోగులకు డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకు మినహాయింపు ఇవ్వవచ్చని సర్క్యులర్ లో పేర్కొన్నారు.

రద్దీని నియంత్రించాలి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్​డౌన్ సడలింపుల మేరకు ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు లాక్ డౌన్ రూల్స్ మేరకు నడుచుకోవాలని, డ్యూటీ షిఫ్టులవారీగా మెయింటేన్ చేయాలని సర్క్యులర్ లో కోరినట్లు జితేంద్ర సింగ్ తెలిపారు. ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేసేందుకు మూడు రకాలుగా డ్యూటీ టైమింగ్స్ సెట్ చేయాలని అన్ని విభాగాల చీఫ్​ లకు వివరించామని చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు, ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 వరకు, ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు డ్యూటీలు కేటాయించాలని సూచించామన్నారు.