ఇవాళ్టి నుంచి స్కూల్స్ ప్రారంభం.. ఇంకా మొదలు కాని పనులు

ఇవాళ్టి నుంచి స్కూల్స్ ప్రారంభం.. ఇంకా మొదలు కాని పనులు
  • సర్కార్​ నుంచి అందని నిధులు.. సాగని పనులు
  • మొదటి విడతలోని వెయ్యికిపైగా 
  • స్కూళ్లలో ఇంకా పనులు మొదలు కాలే
  • స్టార్టయిన చోట పైసలు 
  • సరిపోక ఎక్కడివక్కడే ఆగినయ్​
  • రూ.30 లక్షలు దాటిన పనులకు టెండర్లు కూడా పిలువలే
  • నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం.. ఇక పనులు జరుగుడు కష్టమే!


వేసవి సెలవుల తర్వాత ఇయ్యాల్టి నుంచి స్కూళ్లు తెరుచుకోనుండగా, ‘మన ఊరు మన బడి’ కింద సర్కారు స్కూళ్లలో చేపట్టిన పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. మొదటి విడతలో ఎంపిక చేసిన 9వేల స్కూళ్లలో జూన్​12లోగా అన్ని సౌలతులు కల్పించాల్సి ఉంది. కానీ వెయ్యికి పైగా స్కూళ్లలో ఇప్ప టికీ పనులు మొదలు కాలేదు. అసంపూర్తి పనుల వల్ల అటు టీచర్లు, ఇటు స్టూడెంట్లకు కష్టాలు తప్పేలా లేవు.

వెలుగు, నెట్​వర్క్: సర్కారు బడుల దశ మారడం లేదు. ప్రభుత్వం చెప్తున్న మాటలు ఉత్తిమాటలే అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26,065 గవర్నమెంట్​ స్కూళ్లు ఉండగా.. ‘మన ఊరు.. మనబడి’ కింద  రూ.7,289.54 కోట్లతో మూడు విడతల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఆరునెలల కింద రాష్ట్ర సర్కార్​ ప్రకటించింది. మొదటి విడతలో 9,123 బడులను ఎంపిక చేసి, రూ. 3,497.62 కోట్లతో12 రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఫిబ్రవరిలో జీవో రిలీజ్ చేసింది. ఈ స్కీంలో భాగంగా ఎంపిక చేసిన  స్కూల్​భవనాలకు అవసరమైన అన్ని రిపేర్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్​రూమ్స్ తో పాటు వంటగదులు, ప్రహరీ, మరుగుదొడ్లు, డైనింగ్​రూంల​ నిర్మాణం చేపట్టాలి. ఇంకా తాగునీటి వసతితోపాటు కుర్చీలు, బెంచీలు సహా అన్ని రకాల ఫర్నిచర్​, గ్రీన్​ చాక్​ బోర్డ్స్, డిజిటల్​ఎడ్యుకేషన్​కు కావాల్సిన అన్ని రకాల పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సర్కారు నుంచి సరిపడా ఫండ్స్​ రాకపోవడంతో చాలా స్కూళ్లలో పనులు మొదలు కాలేదు. మొదలైన చోట నిధులు చాలక ఎక్కడికక్కడే ఆగిపోయాయి. రూ.30 లక్షలకు మించి బడ్జెట్​అవసరమయ్యే స్కూళ్లలో పనులకు ఇప్పటికీ టెండర్లు పిలవలేదు. ఈ క్రమంలో సోమవారం నుంచి స్కూళ్లు మొదలైతే పనులు కొనసాగడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఫండ్స్​ అందక..!

ముందుగా అనుకున్న ప్రకారం జూన్​13న స్కూళ్లు రీఓపెన్​ అయ్యే నాటికి మొదటి విడత ఎంపిక చేసిన 9,123 స్కూళ్లలో పనులన్నీ పూర్తి కావాలి. కానీ సర్కారు నుంచి సరిపడా ఫండ్స్​ రాకపోవడంతో వెయ్యికి పైగా స్కూళ్లలో పనులు మొదలుకాలేదు. ప్రారంభించిన చోట్ల ఫండ్స్ సరిపోక పనులు ముందుకు సాగడం లేదు. ఉదాహరణకు నల్గొండ జిల్లాలో ‘మన ఊరు మన బడి’ స్కీం కింద 517 స్కూళ్లు ఎంపిక చేశారు. ఇందుకోసం సర్కారు నుంచి రూ.150 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ. 2 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని 15 శాతం చొప్పున పంచగా, కేవలం 131 స్కూళ్లకే సరిపోయాయి. నిబంధనల ప్రకారం రూ. 30 లక్షల లోపు ఉన్న స్కూళ్లలో పనులు స్కూల్ మేనేజ్​మెంట్ కమిటీలే చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం దాటితే పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర విద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి పనులు అప్పగించాలి. కానీ నల్గొండ జిల్లాలో రూ.30 లక్షల నుంచి  50 లక్షలలోపు అవసరమైన స్కూళ్లు 59, రూ. 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు అవసరమైన స్కూళ్లు 46, రూ.2 కోట్ల బడ్జెట్ దాటిన స్కూళ్లు రెండు ఉన్నాయి. ఈ స్కూళ్లలో ఎలాంటి పనులు మొదలుకాలేదు. నిర్మల్ జిల్లాలో 30 లక్షల కన్నా ఎక్కువ ​ అవసరమయ్యే108 స్కూళ్లకు టెండర్లు పిలవలేదు. సంగారెడ్డిలోని 192 స్కూళ్లదీ ఇదే పరిస్థితి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా టెండర్లు పిలవక పనులు మొదలు కాని స్కూళ్లు వెయ్యికి పైగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.

వచ్చిన ఫండ్స్ 5 నుంచి 15 శాతమే.. 

రూ.30 లక్షల కంటే తక్కువ ఫండ్స్​ అవసరమయ్యే పనులను స్కూల్​ మేనేజ్​మెంట్​ కమిటీలే చేస్తున్నాయి. కానీ అంచనా వ్యయంలో సర్కారు నుంచి 5 నుంచి 15 శాతం నిధులు మాత్రమే రావడంతో పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయి. మెదక్​ జిల్లాలో రూ. 53 కోట్ల అంచనాతో 313 స్కూళ్లను ఎంపిక చేయగా.. 127 స్కూళ్లకు 10 నుంచి 15 శాతం మాత్రమే ఫండ్స్​ వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు 66 బడుల్లో మాత్రమే పనులు మొదలయ్యాయి. పైసలు సరిపోక అన్ని పనులు మధ్యలోనే ఆగిపోయాయి. మంచిర్యాల జిల్లాలో 112 స్కూళ్లకు 5 నుంచి 10 శాతం ఫండ్స్​ రాగా.. ఇప్పటి వరకు 92 స్కూళ్లలో ఎలక్ట్రిఫికేషన్, గుంతలు తవ్వడం లాంటి పనులు ప్రారంభించారు. సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం కానుండగా.. పిల్లలు స్కూల్​లోకి వెళ్లాలంటే ప్రమాదకరమైన ఆ గుంతలు దాటిపోవాల్సిన  పరిస్థితి. పిల్లలకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.  భూపాలపల్లి  జిల్లాలో149 స్కూళ్లకు రూ.36 కోట్లు కావాల్సి ఉండగా, 10 కోట్లు మాత్రమే వచ్చాయి. ములుగు జిల్లాలో 125 స్కూళ్లకుగాను  కేవలం 36 స్కూళ్లకు ఫండ్స్​ కేటాయించారు. కామారెడ్డి జిల్లాలో 351 స్కూళ్లకుగాను  15 చోట్ల మాత్రమే పనులు మొదలయ్యాయి. మిగతా చోట్ల బడ్జెట్​ ఎస్టిమేషన్​ ఇటీవలే పూర్తయింది.  నారాయణపేట్ జిల్లాలో 174 స్కూళ్లను ఎంపిక చేయగా..  ఫండ్స్​ లేక 80 శాతం స్కూళ్లలో పనులు నిలిచిపోయాయి.  కరీంనగర్ జిల్లాలో 230 స్కూళ్లను ఎంపిక చేయగా, 31 స్కూళ్లలో మాత్రమే పనులు పూర్తయ్యాయని ఆఫీసర్లు చెప్తున్నారు. మిగిలిన అన్ని స్కూళ్లలోనూ పనులు మధ్యలో ఆగిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 237 స్కూళ్లను ఎంపిక చేయగా, ఫండ్స్​ లేక 54 చోట్ల మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి.  మహబూబ్​నగర్​ జిల్లాలో  291 స్కూళ్లను ఎంపిక చేయగా, ఇప్పటికీ ఫండ్స్​ రాకపోవడంతో చాలా స్కూళ్లలో పనులు మొదలుకాలేదు. దీంతో ఈజీఎస్​ కింద టాయిలెట్ల నిర్మాణం, రంగులు వేయించడం లాంటి పనులు చేయిస్తున్నారు. 

టెండర్లు పిలువలే.. పనులు షురూ చేయలే

ఇది సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని ఐనాపూర్ గవర్నమెంట్​ స్కూల్​. దీన్ని ‘మన ఊరు మన బడి’ కింద ఎంపిక చేసి, అడిషనల్​ క్లాస్​ రూమ్స్​ సహా వివిధ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ.64 లక్షల పనులకు పర్మిషన్​ వచ్చింది. రూ.30 లక్షల బడ్జెట్​ మించితే టెండర్లు పిలవాలి. కానీ ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. స్కూల్​ శిథిలావస్థకు చేరింది. పాత గదుల్లోనే క్లాసులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

గుంతలు తవ్వి వదిలేశారు

మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రం కొత్తగూడెం కాలనీలోని  ప్రైమరీ స్కూల్​ను ‘మన ఊరు - మన బడి’ స్కీం కింద ఎంపిక చేశారు. ఇక్కడ కాంపౌండ్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్స్ తదితర పనులు చేపట్టేందుకు రూ.6 లక్షలు కేటాయించారు. కానీ ఫండ్స్​రాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. కేవలం ఈజీఎస్​ స్కీం కింద టాయిలెట్స్​కు ఇలా గుంతలు తవ్వి వదిలేశారు.