నిధులు లేక మూతపడిన కోచింగ్ సెంటర్లు

నిధులు లేక మూతపడిన కోచింగ్ సెంటర్లు

కేయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోచింగ్, స్టడీ సెంటర్లు మూతపడ్డాయి. నిధులు లేక నిర్వహణ కష్టంగా మారింది. హడావిడిగా కోచింగ్, స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. 

శిక్షణ కేంద్రం తలుపులు తీసే వారే కరువు

కాకతీయ విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్య కోసం ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే ఇక్కడి స్టూడెంట్స్ కోసం ఈ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో అంబేద్కర్ స్టడీ సెంటర్, మహిళా అధ్యయన కేంద్రాలకు డైరెక్టర్లతో పాటు నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించారు. నిధులు విడుదల చేయకపోవడంతో ఈ సెంటర్లు తెరుచుకోవటం లేదు. కేయూలోని మానవీయ శాస్త్ర భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం తలుపులు తీసే వారే కరువయ్యారని విద్యార్థులు చెబుతున్నారు.  

మహిళా అధ్యయన కేంద్రానిది ఇదే పరిస్థితి

 కేయూలో జాతీయస్థాయి నెట్ పరీక్షలో పీజీ పూర్తి చేసిన విద్యా ర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, నెట్ కోచింగ్ సెంటర్ ఆరు నెలలుగా మూత పడింది. మహిళా అధ్యయన కేంద్రానిది ఇదే పరిస్థితి అని విద్యార్థులు అంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో సెంటర్లు దుమ్ము, ధూళితో నిండి పోయాయంటున్నారు. యూజీసీ నిధులతో కేయూలో బీఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ ను అధికారులు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ భావాజాల వ్యాప్తి దీని ప్రధాన లక్ష్యం. కానీ, ఇక్కడ గదులు తప్ప.. పుస్తకాల కనిపించడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. కోచింగ్, స్టడీ సెంటర్లు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వాపోతున్నారు.