ఇక ఆన్‌లైన్‌లో జాబ్ సర్వే

ఇక ఆన్‌లైన్‌లో జాబ్ సర్వే


న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌‌వేవ్ చాలా మంది ఉపాధిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అయితే ఫ్యాక్టరీలకు ఆఫీసర్లు వెళ్లే డేటా తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఆన్‌‌లైన్‌‌లో జాబ్ సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా జాతీయ సామాజిక-,ఆర్థిక సర్వేలు నిలిపివేయడంతో నేషనల్‌ జాబ్‌ పాలసీతయారీ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితులు మామూలుస్థితికి వచ్చేదాకా ఆగడం కన్నా,  క్వార్టర్లీ జాబ్‌ సర్వేను నిర్వహించాలని ఎన్‌‌డీఏ ప్రభుత్వం నిర్ణయించుకుంది.  జాబ్స్‌‌పై కోవిడ్ మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆన్‌‌లైన్ సర్వే ఉపయోగపడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.  వలస కార్మికులు, పనిమనుషులు, రోజువారీ కూలీలు, ట్రాన్స్‌‌పోర్ట్‌‌ సెక్టార్ కార్మికుల జాబ్స్‌ గురించి చేపట్టాల్సిన నాలుగు సర్వేలను నిలిపివేశారు. ఐదో సర్వే అయిన క్వార్టర్లీ ఎంప్లాయ్మెంట్ సర్వే (క్యూఈఎస్) ముందుకు సాగుతుందని, అయితే ఆన్‌‌లైన్‌‌లో నిర్వహిస్తారని ఇద్దరు ఆఫీసర్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో సర్వే ప్రారంభమవుతుంది. దాదాపు నాలుగు సంవత్సరాల విరామం తర్వాత క్యూఈఎస్‌‌ను చేపట్టారు. పెద్ద కంపెనీలు, సెక్టార్లలో జాబ్‌ అవకాశాలపై ఇది ఫోకస్ చేస్తుంది.  ఆన్‌‌లైన్ సర్వే ఫలితం జూలై చివరి నాటికి వస్తుంది. "నాలుగు సర్వేలను నిలిపివేసినప్పటికీ ఐదో దానితో ముందుకు వెళ్తున్నాం. ఇది క్యూఈఎస్ సర్వే. ఫ్యాక్టరీలకు వెళ్లడం ఉండదు. ఆన్‌‌లైన్‌‌లోనే డేటాను తీసుకుంటాం”అని లేబర్ బ్యూరో డైరెక్టర్ జనరల్ డి.పి.ఎస్. నేగీ అన్నారు.  కేంద్ర కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఈ బ్యూరో పనిచేస్తుంది. సామాజిక,-ఆర్థిక సర్వేలతో పాటు క్యూఈఎస్ ను నిర్వహించే బాధ్యత దీనిదే!

ఆన్‌‌లైన్‌‌లోనే అన్ని పనులు..

కంపెనీలు, ఫ్యాక్టరీల నుండి అందుబాటులో ఉన్న విధానాల ద్వారా ఈ సంస్థ డేటా సమాచారాన్ని సేకరించింది. ఆన్‌‌లైన్ , టెలిఫోన్ ద్వారా సర్వే చేస్తున్నారు. నిజానికి ఇది కరెక్ట్ సర్వే కాదు కానీ, కరోనా కారణంగా, సర్వేయర్ల ఆరోగ్యం ప్రమాదంలో పడకుండా ఆన్‌‌లైన్‌‌లో క్యూఈఎస్ చేయడం మంచిదని నిర్ణయించామని నేగీ వివరించారు. కరోనా మహమ్మారికి ముందే, డిమాండ్‌‌కు తగినన్ని ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందిపడుతున్నారు.  ఈ వైరస్‌ వచ్చాక ఫార్మల్, ఇన్ఫార్మల్  మార్కెట్లు దెబ్బతిన్నాయి, లక్షలాది మంది జాబ్స్ పోయాయి. ఫస్ట్ వేవ్  సుమారు 23 లక్షల మంది భారతీయులను పేదరికంలోకి నెట్టివేసిందని అజీమ్ ప్రేమ్‌‌జీ వర్సిటీ సర్వే వెల్లడించింది.  గ్రామీణ ఉపాధిపై దృష్టి పెట్టాలని , సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి పేదలకు నేరుగా నగదు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. 

సెకండ్ వేవ్‌‌తోనూ ఉపాధిపై దెబ్బ..

సెకండ్ వేవ్ కూడా ఎకానమీని దెబ్బతీస్తోంది.  లేబర్ మార్కెట్‌‌ అతలాకుతలం అయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రిపోర్ట్ ప్రకారం,  2021 ఏప్రిల్లోనే  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 34 లక్షల మంది శాలరీడ్ ఎంప్లాయిస్ జాబ్స్‌‌కు దూరమయ్యారు. మొత్తం 73.5 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. సేవలు, మైనింగ్‌‌ సెక్టార్లలో ఉపాధి కల్పనపై ఈసారి ఫోకస్ చేస్తామని  కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని 1.50 లక్షల కంపెనీల నుండి ఉద్యోగ కల్పన డేటాను సేకరిస్తారు. 2008లో గ్లోబల్‌‌గా ఎకానమీ దెబ్బతినడంతో  క్యూఈఎస్‌‌ను మొదలుపెట్టారు. ఇది 2017 
వరకు కొనసాగింది. సుమారు 2,500 కంపెనీల సమాచారాన్ని సేకరించారు. ప్రస్తుత సర్వేలో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేసే సంస్థలను కవర్ చేస్తారు. ‘‘టెలిఫోన్ , ఆన్‌‌లైన్ పద్ధతుల ద్వారా క్యూఈఎస్ నిర్వహించడం అంత సులభం కాదు. కంపెనీల ఏప్రిల్-జూన్ క్వార్టర్లీ ఫలితాల రిపోర్టులు జూలై చివరి నాటికి విడుదల అవుతాయి.  ఉద్యోగులు , యజమానులపై కోవిడ్ ఎఫెక్ట్‌‌ను అంచనా వేయాలంటే అవి వచ్చేదాకా ఆగాలి. ఈసారి తగినంత డేటా అందుతుందని అనుకుంటున్నాం” అని నేగీ వివరించారు.