పరిహారం అందలేదని.. నిర్వాసితురాలు సూసైడ్

పరిహారం అందలేదని.. నిర్వాసితురాలు సూసైడ్
  •     గౌరవెల్లి ప్రాజెక్టు కోసం 
  •     భూమి ఇచ్చిన భూక్యా లక్ష్మి
  •     రెండేళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వకపోవడంతో ఆవేదన
  •     ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య.. అనాథలైన ముగ్గురు పిల్లలు

హుస్నాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా పరిహారం అందలేదన్న ఆవేదనతో ఓ నిర్వాసితురాలు ఆత్మహత్య చేసుకుంది. సీఎం సొంత జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామ పంచాయతీలోని సోమాజీతండాకు చెందిన భూక్యా లక్ష్మి (40) భర్త కనకయ్య రెండేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు.  కూలి పనులు చేసుకుంటూ తమ ముగ్గురు పిల్లలు దివ్య, నవ్య, రామును లక్ష్మి పోషించుకుంటోంది. ఆమెకు చెందిన 1.10 ఎకరాల వ్యవసాయ భూమిని గౌరవెల్లి ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం సేకరించింది. ఇందుకు సంబంధించి రెండేళ్ల కిందట కన్సెంట్ ఇచ్చి లక్ష్మి సంతకాలు చేసింది. అప్పటి నుంచి పరిహారం డబ్బుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉంది. అధికారులు రేపు మాపు అంటూ తిప్పుతున్నారే తప్ప పైసలు మాత్రం ఇవ్వలేదు. కొద్ది రోజుల కిందట కోర్టుకు వెళ్లిన నిర్వాసితుల్లో కొందరికి అధికారులు ఎకరాకు రూ.15 లక్షలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. 2 రోజుల కిందట తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లిన లక్ష్మి.. తన పెండింగ్ పరిహారం గురించి వాకబు చేసింది. ‘ఇప్పట్లో నీ పరిహారం రాదు’ అని అక్కడి సిబ్బంది చెప్పడంతో ఆవేదనకు గురైంది. పరిహారం డబ్బులు రాకుంటే తమ కుటుంబం ఎట్ల బతుకుతుందని చుట్టుపక్కల వాళ్లకు చెప్పుకుని బాధపడింది. ఆదివారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.