ఓటు ‘పట్టని’ భద్రులు

ఓటు ‘పట్టని’ భద్రులు
  •     వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో
  •     ఓటు హక్కు నమోదుకు నో రెస్పాన్స్
  •     ఇంకా 13 రోజులే గడువు  
  •     5 శాతం కూడా దాటని అప్లికేషన్లు
  •     కొత్త వారితో పాటు పాత ఓటర్లు కూడా నమోదు చేసుకోవాలని ఈసీ ప్రకటన
  •     కొత్త గ్రాడ్యుయేట్లే ఎన్ రోల్  చేసుకోవాలేమో అన్న భ్రమలో పాత ఓటర్లు
  •     ఆ దిశగా అవగాహన కల్పించలేకపోతున్న ఆఫీసర్లు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : వరంగల్‌‌, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ పరిధిలోని 12 జిల్లాల్లో పట్టభద్రుల‌ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు చాలా తక్కువ స్పందన వస్తోంది. గతంలో  ఈ జిల్లాల పరిధిలో 5,05,565 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 12,872 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తులు సమర్పించారని ఆఫీసర్లు ప్రకటించారు. 2021 మార్చి నెలలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3,74,117 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలిచిన పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డి..  ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్‌‌లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

దీంతో తన ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ సీటు కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్షన్‌‌  కమిషన్‌‌  నిరుడు డిసెంబర్‌‌ 30న ఓటు హక్కు నమోదు కోసం నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. 2020 నవంబర్ 1 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన పట్టభద్రులను ఓటర్లుగా గుర్తించాలని పేర్కొంది. ఫిబ్రవరి 6వ తేదీలోగా ఆన్‌‌లైన్‌‌  లేదా ఆఫ్‌‌లైన్‌‌లో దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఇచ్చింది. అన్నీ పరిశీలించాక ఏప్రిల్‌‌ 4న ఫైనల్‌‌  ఓటర్‌‌  లిస్ట్‌‌  జారీ చేస్తామని ఈసీ ప్రకటించింది. 

పాత ఓటర్లు కూడా అప్లికేషన్లు సమర్పించాలి

ఎలక్షన్‌‌  నోటిఫికేషన్‌‌ ప్రకారం కొత్త వాళ్లతో సహా పాత ఓటర్లందరూ మళ్లీ అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం ఇప్పటిదాకా లక్షల మంది పాత ఓటర్లకు తెలియదు. దీంతో వాళ్లెవ్వరు కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు ఇవ్వడం లేదు. కొత్తవారే ఆ అప్లికేషన్లు ఇవ్వాలన్న భ్రమలో ఉండిపోయారు. పాత, కొత్త అనే తేడా లేకుండా గ్రాడ్యుయేట్లంతా తాము నివసించే పరిధిలో ఉండే ఆయా తహసీల్దార్‌‌  ఆఫీసు లేదా ఆర్డీవో కార్యాలయాల్లో నేరుగా ఫారం-18 ద్వారా అప్లికేషన్లు సమర్పించాలి. ఆన్‌‌లైన్‌‌లో  కూడా అప్లికేషన్‌‌  ఇవ్వవచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు. గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కోసం ఇంకా 13 రోజుల గడువు మాత్రమే ఉంది.

ఫిబ్రవరి 6తో దరఖాస్తుల స్వీకరణ పూర్తవుతుంది. ఇప్పటికీ ఆయా జిల్లాలో 5 శాతం అప్లికేషన్లు కూడా రాలేదు. దీంతో ఓటరు‌ నమోదు ప్రక్రియ జిల్లా కలెక్టర్లకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటిదాకా పత్రికా ప్రకటనలకే పరిమితమైన అధికారులు.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీలు, తహసీల్దార్‌‌  ఆఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 

ఆన్‌‌లైన్‌‌లో చాలా ఈజీ ప్రాసెస్‌‌

గ్రాడ్యుయేట్‌‌  ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుహక్కు నమోదు ప్రక్రియలో ఆన్‌‌లైన్‌‌  విధానం చాలా ఈజీగా ఉంది. ఆన్ లైన్  అప్లికేషన్ల కోసం  http://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspx   వెబ్‌‌సైట్‌‌కు వెళ్లి అడిగిన సమాచారం నింపి దరఖాస్తుదారుని ఫొటో,  తాను చదివిన డిగ్రీ మెమో లేదా యూనివర్సిటీ అందించిన ప్రొవిజన్‌‌ సర్టిఫికెట్‌‌ జతపరిస్తే సరిపోతుంది. ఇంటి నంబర్‌‌, నివాసం ఉండే ఏరియా, గ్రామం వివరాలతో పాటు ఓటర్  ‌ఐడీ వివరాలు, ఆధార్‌‌ నంబర్‌‌,  ఫోన్‌‌  నంబర్‌‌, ఈమెయిల్‌‌  ఐడీ వంటివి నమోదు చేయాల్సి ఉంటుంది. అన్నీ పూర్తిచేసి సబ్ మిట్‌‌  బటన్‌ ‌ నొక్కగానే దరఖాస్తుదారునికి ఐడీ  నంబర్‌‌  వస్తుంది.

ఆ తర్వాత తహసీల్దార్‌‌  ఆఫీసు‌ నుంచి దరఖాస్తుదారుని ఇంటికి ఎంక్వైరీకి వచ్చినప్పుడు తమ ఒరిజినల్‌‌ సర్టిఫికెట్లు చూపిస్తే ఓటు హక్కు కల్పిస్తారు. తమ ఇంటి నుంచే మొబైల్‌‌ ఫోన్‌  లేదా కంప్యూటర్‌‌ లో అప్లికేషన్లు సమర్పించవచ్చు. లేదా సర్టిఫికెట్లు తీసుకొని దగ్గరలో ఉండే ఏదైనా ఆన్‌‌లైన్‌‌  సెంటర్‌‌కు వెళ్లి అప్లై చేయవచ్చు. ఆఫ్‌‌లైన్‌‌లో అయితే దరఖాస్తు ఫారం‒18 పూర్తిగా నింపడంతో పాటు డిగ్రీ మెమో లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఓటర్  ఐడీ కార్డు, ఆధార్  కార్డు జిరాక్స్‌‌ ప్రతులపై గెజిటెడ్‌‌  ఆఫీసర్‌‌ సంతకం చేయించి దగ్గరలో ఉన్న తహసీల్దార్‌‌  ఆఫీసు లేదా ఆర్డీవో కార్యాలయంలో సమర్పించాలి. అప్లికేషన్  ఫారంపై ఫొటో 
అతికించాలి.

మళ్లీ అప్లై చేయాల్నా?

నేను 2013లో డిగ్రీ పూర్తి చేసిన. 2021 గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన. ఈసారి కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తులు ఇవ్వాలని చెబుతున్నరు. ఇదేందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఆఫ్‌‌లైన్‌‌ దరఖాస్తులు బయట దొరకట్లేదు. ఆన్‌‌లైన్‌‌లో చేద్దామంటే సర్వర్‌‌ బిజీ అంటున్నరు. టైమ్‌‌ ఏమో చాలా తక్కువ ఉంది. 

కె.మల్లేశ్‌, డిగ్రీ గ్రాడ్యుయేట్‌‌, భూపాలపల్లి

పాత ఓటర్లు కూడా అప్లికేషన్లు ఇవ్వాలి 

వరంగల్‌‌, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు కోసం పాత ఓటర్లు కూడా అప్లికేషన్లు ఇవ్వాలి. 2020 నవంబర్ 1 నాటికి డిగ్రి ఉత్తీర్ణత సాధించిన పట్టభద్రులు ఇందుకు అర్హులు. గతంలో ఓటర్లు అయినప్పటికీ తమ ఓటు హక్కు కోసం ఇప్పడు మళ్లీ కొత్తగా నమోదు చేసుకోవాలి. ఫిబ్రవరి 6వ తేదీ లోగా ఫారం‒18 ద్వారా ఆన్‌‌లైన్‌‌  లేదా ఆఫ్‌‌లైన్‌‌లో అప్లికేషన్లు సమర్పించవచ్చు.

ఇలా త్రిపాఠి, ములుగు జిల్లా కలెక్టర్ 

నాకైతే ఏం తెల్వదు 

గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పాతవారు కూడా అప్లికేషన్లు ఇవ్వాల్నా? ఇదేందీ. నాకైతే ఏం తెల్వదు. నేను 2014లో డిగ్రీ కంప్లీట్‌‌  చేసిన. 2021 ఎలక్షన్లలో ఓటు వేసిన. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కడికి పోవాలే. ఎట్లా దరఖాస్తు చేయాలే. ఈ విషయం మా దోస్తులకు కూడా తెల్వదు.

ఎం.స్రవంతి, డిగ్రీ గ్రాడ్యుయేట్‌‌, భూపాలపల్లి టౌన్‌‌