
- సీఎమ్మార్ ఇవ్వని మిల్లులకు ధాన్యం కేటాయించని అధికారులు
- సూర్యాపేట జిల్లాలో 78 ఉంటే 21కి మాత్రమే ట్యాగింగ్
- ధాన్యం సేకరణపై ఎఫెక్ట్
- ఇప్పటివరకు 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
సూర్యాపేట, వెలుగు: యాసంగి వడ్ల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఎక్కువ టార్గెట్ పెట్టుకోగా.. సీఎంఆర్ కు ఇచ్చే మిల్లులు మాత్రం తక్కువగా ఉన్నాయి. గతంలో సీఎమ్మార్ఇవ్వని మిల్లులకు ఈసారి అధికారులు ధాన్యం కేటాయించలేదు. దీని ఎఫెక్ట్ సూర్యాపేట జిల్లాలో వడ్ల సేకరణపై పడింది. మొత్తం 78 మిల్లులకుగాను 21 మాత్రమే ట్యాగింగ్ చేశారు.
ఈ ఫలితంగా మిల్లుల్లో సరిపడా స్థలం లేక కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. జిల్లాలో ఏప్రిల్ మొదటి వారంలో వడ్ల కొనుగోళ్లు ప్రారంభమవగా ఇప్పటివరకు 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సీఎంఆర్ మిల్లులు తక్కువగా ఉండడంతో ధాన్యం లోడ్ తో వెళ్లిన లారీలు అన్ లోడ్ కోసం రోజులు తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. దీనికి తోడు అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని మిల్లులు..
2022–23 యాసంగి సీజన్ సీఎమ్మార్ ఇవ్వని మిల్లులకు ఈ సీజన్ లో ధాన్యం కేటాయించలేదు. మరోవైపు కొంతమంది మిల్లర్లు అప్పటి ప్రభుత్వం మిల్లుల కెపాసిటీకి మించి ధాన్యం ఇచ్చిందని.. మిల్లుల్లో సరిపడా స్థలం లేక ధాన్యాన్ని బయట అన్లోడ్చేయించడంతో వర్షానికి తడిసి, నష్టపోయామంటూ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.1,880 మద్దతు ధర చెల్లించలేమని రూ.1,500 మాత్రమే ఇస్తామన్నారు. ఇలా.. జిల్లాలోని 60 మిల్లులు దాదాపు రూ.350 కోట్లకు పైగా విలువైన సీఎంఆర్ఇవ్వలేదు. ఈసారి 25 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే సీఎమ్మార్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఒక్క మిల్లు కూడా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకపోవడంతో ఎలాంటి సీఎమ్మార్ బకాయిలు లేని 21 మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించి, వాటికి ట్యాగింగ్ చేశారు.
3.50 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్..
ప్రభుత్వం ఈ యాసంగికి సూర్యాపేట జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఏప్రిల్ మొదటి వారంలో 326 కొనుగోళ్లు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభించారు. అయితే, మిల్లులు తక్కువగా ఉండడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. జిల్లాలో దాదాపు 250 లారీలను ధాన్యం తరలించేందుకు ఏర్పాటు చేయగా 21 మిల్లుల వద్ద అన్లోడింగ్కు 3 నుంచి 8 రోజుల సమయం పడుతోంది. దీంతో, కొన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించి, 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు జరగకపోవడం గమనార్హం.
అద్దెకు గోదాంలు తీసుకునేందుకు ప్రతిపాదనలు
మిల్లుల్లో సేకరించిన ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఇప్పటికే కోదాడ, హుజూర్ నగర్, నేరేడు చర్లలో ఉన్న సెంట్రల్ వేర్ హౌస్ గోదాంలను తీసుకొని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. వాటి సామర్థ్యం తక్కువగా ఉండడంతో ప్రైవేట్ గోదాంలను అద్దెకు తీసుకునేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం ఉన్న 3 గిడ్డంగుల కెపాసిటీ 7,500 మెట్రిక్ టన్నులు మాత్రమే. మరో 50 వేల మెట్రిక్టన్నుల కెపాసిటీ కలిగిన గిడ్డంగులకు ప్రపోజల్స్పెట్టారు.