భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం బంగారు పుష్పాలతో అర్చన జరిగింది. సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు బాలబోగం నివేదించారు. అనంతరం పంచామృతాలతో అభిషేకం జరిగింది. మంజీరాలు అద్ది తిరుమంజనం చేశారు. స్నపన తిరుమంజనం అనంతరం భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. మూలవరులకు అలంకరణ చేసి ప్రత్యేక హారతులు సమర్పించారు.
బంగారు పుష్పాలతో అర్చన ఘనంగా చేశారు. భక్తులు సైతం ఈ అర్చనలో పాల్గొన్నారు. బేడా మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరగ్గా భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజభోగం నివేదించారు. సాయంత్రం బేడా మండపంలో దర్బారు సేవ వైభవంగా జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంకు చెందిన వెంకటలక్ష్మి, రామలక్ష్మి అనే భక్తులు 650 గ్రాముల వెండితో తయారు చేసిన రూ.1.50లక్షల విలువ చేసే పళ్లెంను సీతారామచంద్రస్వామికి విరాళంగా అందజేశారు.
