ఆహారం కోసం వెతుకులాటలో అనుకోకుండా ఎలుగుబంటి పక్క అరణ్యంలోకి వచ్చేసింది. అది చూసి అడవికి రాజు సింహం కోపంతో గర్జించింది. దానికి ఎలుగుబంటి వినయంగా,‘‘మా అడవిలో ఆహారం కొరత ఎక్కువగా ఉంది. మీరు అనుమతి ఇస్తే మీ అడవిలో కొంతకాలం తలదాచుకుంటాను” అంది. సింహం కాదనలేదు. అప్పటినుంచి ఎలుగుబంటి సింహం పట్ల కృతజ్ఞతతో ఉండిపోయింది. కాలం గడిచే కొద్దీ సింహం మాటల ద్వారా ఎలుగుబంటి ఒక విషయం తెలుసుకుంది. అదేమంటే సింహానికి అదే అడవిలో ఉండే పెద్దపులికి మధ్య శత్రుత్వం ఉంది. ఒకరోజు ఎలుగుబంటికి పెద్దపులి తారసపడింది. పలకరించి కాసేపు మాట్లాడింది. అది సింహం గమనించి, ‘‘నా శత్రువుతో నీకేమిటి మాటలు” అంటూ కోప్పడింది.
అయ్యో పెద్దపులి మీ శత్రువని నాకు తెలియదు. మీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడిందే! మీ పరిపాలనలో అడవి సుభిక్షంగా ఉందట’’ అన్నది ఎలుగుబంటి. ఇంతవరకు పెద్దపులి తనకు శత్రువు అని సింహం అనుకుంది. తనను తరచూ విమర్శిస్తూ ఉంటుందని అడవిలోని కొన్ని జంతువులు చెప్తే విన్నది. కానీ, పెద్దపులి తనను పొగిడిందని ఎలుగుబంటి చెప్పింది. సింహానికి చాలా ఆనందం కలిగింది.
మరొకసారి పెద్దపులి కనిపించినప్పుడు , ‘‘అప్పుడప్పుడూ నాతో రాజుగారు నీ వీరత్వాన్ని పొగుడుతూ ఉంటారు’’ అంది ఎలుగుబంటి. పులి పొంగిపోయింది. ఆ విధంగా సింహానికి పులికి మధ్య శత్రుత్వం తగ్గి మిత్రుత్వం పెరిగేటట్టు ఎలుగుబంటి చేయగలిగింది. త్వరలోనే అవి మంచి మిత్రులయ్యాయి. ఇదంతా గమనిస్తున్న కుందేలు ఎలుగుబంటితో ‘‘శత్రువులను మిత్రులుగా మార్చావు.
దీనివల్ల నీకేమిటి లాభం?” అంటూ ప్రశ్నించింది. ‘‘అడవిలో ఉన్న ఆ ఇద్దరు బలవంతులు ఒక్కటయితే అడవికి ఎంతో మేలు. శత్రువులుగా ఉంటే ఎంతో నష్టం. పోరు నష్టం, పొందు లాభం అని పెద్దలన్నారు కదా! నేనీ అడవిలోకి వచ్చిన కొత్తలో ఒక విషయం గమనించాను. వారిద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలను అవకాశవాదులైన కొన్ని అడవి జంతువులు చీమంతను కొండంత చేసి, అక్కడ మాట ఇక్కడా, ఇక్కడ మాట అక్కడా చెప్పి తగాదాలను పెంచారు. నేనిది గమనించి తగాదాలను తగ్గించాలని అనుకున్నాను. ప్రయత్నాలు ప్రారంభించాను. అవి ఫలించాయి’’ అన్నది.
ఎలుగుబంటి మంచి మనసుకు కుందేలు సంతోషించింది. సమయం చూసుకుని సింహంతో ఆ విషయం చెప్పింది. ఎలుగుబంటి మంచి మనసుకి సింహం ఆనందపడింది. కొద్దిరోజుల తరువాత ఎలుగుబంటి సింహంతో, ‘‘అయ్యా! ఇబ్బందుల్లో వచ్చిన నాకు ఆశ్రయం ఇచ్చి కాపాడారు. కృతజ్ఞుడ్ని. ఇంక సెలవు. మా అడవికి వెళతాను’’ అన్నది. నువ్వెక్కడికి వెళ్లనక్కరలేదు. నీ మంచితనం నాకు నచ్చింది. నాకిక నువ్వే ఆంతరంగిక సలహాదారుడివి” అన్నది సింహం. ఎలుగుబంటి సంతోషంగా అక్కడే ఉండిపోయింది.
- డా. గంగిశెట్టి శివకుమార్
