NATS : టాంపాలో వైభవంగా ముగిసిన 8వ నాట్స్ తెలుగు సంబరాలు: సందడి చేసిన సినీ సెలబ్రిటీలు

NATS : టాంపాలో వైభవంగా ముగిసిన 8వ నాట్స్ తెలుగు సంబరాలు:  సందడి చేసిన సినీ సెలబ్రిటీలు

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో జరిగిన 8వ నాట్స్ (నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ) తెలుగు సంబరాలు వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు వేలాది మంది తెలుగువారు తరలివచ్చారు. వేదిక ప్రాంగణం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కోలాహలంగా మారింది.

అంగరంగ వైభవంగా వేడుకలు
ఈ సంబరాలు "నెవ్వర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్" అనే నినాదానికి తగ్గట్టుగా నాట్స్ ( NATS )  తెలుగు సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అల్లు అర్జున్, శ్రీలీల వంటి సినీతారలతో పాటు అలనాటి నటీమణులు జయసుధ, మీనా సందడి చేశారు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ తమ సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సుమారు 20 వేల మందికి పైగా తెలుగువారు ఈ సంబరాల్లో పాల్గొని, "ఇది మన తెలుగు సంబరం – జరుపుకుందాం కలిసి అందరం" అనే నినాదాన్ని సార్థకం చేశారు.

ఈ అద్భుతమైన సంబరాల విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి  నాట్స్ కమిటీ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.  కమిటీ డైరెక్టర్లు, కో-డైరెక్టర్లు, చైర్, కో-చైర్, టీమ్ మెంబర్లు, వాలంటీర్లు అందరూ సైనికుల్లా పని చేసి ఈ వేడుకలను విజయవంతం చేశారని అభినందించారు.  బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సెక్రటరీ మల్లాది శ్రీనివాస్ చక్కటి ప్రణాళిక, సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నడింపిచారని కొనియాడారు. ఈ వేడుకలకు వచ్చిన అతిథులకు, కమ్యూనిటీకి, కళాకారులకు, సహకరించిన వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ALSO READ : ముంచేసిన 'తమ్ముడు'.. పెట్టిన బడ్జెట్ రూ.75 కోట్లు.. వచ్చిందేమో 6 కోట్లే !

సామాజిక బాధ్యత 
సంబరాల నిర్వహణతో పాటు నాట్స్ ( NATS ) తమ సామాజిక బాధ్యతను కూడా చాటుకుంది. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి నాట్స్ 85 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసింది. ఈ విరాళాన్ని ఆసుపత్రి చైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు నాట్స్ నాయకత్వం అందించింది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా నాట్స్ కేవలం వినోదానికి మాత్రమే కాకుండా సమాజ సేవకు కూడా పెద్ద పీట వేస్తుందని నిరూపించింది.  ఈ నాట్స్ తెలుగు సంబరాలు కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, తెలుగుదనం, సంస్కృతి, సామాజిక బాధ్యతలకు అద్దం పడుతుందని తెలుగు నటీనటులు కొనియాడారు.