
భారీ అంచనాలతో యువ కథానాయకుడు నితిన్ నటించిన యాక్షన్ డ్రామా 'తమ్ముడు' చిత్రం జూలై 4న విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. తొలిరోజు ఓ మోస్తరు వసూళ్లను సాధించినప్పటికీ, ఆ తర్వాత సినిమా ఊపును కొనసాగించలేక, చివరికి నిరాశను మిగిల్చింది. ఇప్పటికే వరుస పరాజయాలతో ఉన్న నితిన్ కు ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తాకొట్టడంతో ఆయన కెరీర్ పై తీవ్ర పడుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తొలి రోజు హంగామా, ఆ తర్వాత మాయం!
'తమ్ముడు' సినిమా విడుదలైన తొలి రోజు కొంత ఆసక్తిని రేకెత్తించింది. Sacnilk నివేదిక ప్రకారం, మొదటి రోజు రూ. 1.9 కోట్ల వసూళ్లతో పర్వాలేదనిపించింది. కానీ, ఈ ఊపు ఎంతో కాలం నిలబడలేదు. వారాంతం (జూలై 5, 6)లో వసూళ్లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇక ఐదో రోజు, అంటే జూలై 8న, సినిమా కేవలం 40 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇది అంతకు ముందు రోజు (జూలై 7) సాధించిన 67 కోట్ల కంటే 40 శాతం తక్కువ కావడం సినిమా పరిస్థితిని స్పష్టం చేస్తుంది. మొత్తంగా ఐదు రోజుల్లో 'తమ్ముడు' సాధించిన వసూళ్లు కేవలం రూ. 5.41 కోట్లు మాత్రమే. ఈ లెక్కలు చూస్తేనే సినిమాకు థియేటర్లలో పెద్దగా ఆదరణ లభించలేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆక్యుపెన్సీ కష్టాలు, ప్రాంతీయ వ్యత్యాసాలు
వసూళ్లే కాకుండా, ఆక్యుపెన్సీలోనూ 'తమ్ముడు' తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఐదో రోజు సినిమాకు ఓవరాల్‌గా 11.40 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. ఉదయం షోలు, మధ్యాహ్నం షోలకు ఆక్యుపెన్సీ మరింత తక్కువగా ఉండగా నైట్ షోలు కాస్త మెరుగైన ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. కొన్ని ప్రాంతాల్లో సినిమాకు చాలా తక్కువ ఆదరణ లభించినా, అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కరీంనగర్‌లో 47 శాతం అత్యధిక ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే, కాకినాడ 6 శాతం, నిజామాబాద్ 2 శాతం వంటి కీలక ప్రాంతాల్లో సినిమాకు ప్రేక్షకులు కరువయ్యారు.
భారీగానే నష్టం.
అయితే 'తమ్ముడు' చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. నటీనటుల నటనను కొందరు ప్రశంసించినప్పటికీ, సినిమా కథనం, దర్శకత్వంపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు కృత్రిమంగా ఉన్నాయని, కొన్ని చోట్ల టీవీ సీరియల్స్‌ను తలపించాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సినిమాకు వచ్చిన ప్రతికూల 'వర్డ్-ఆఫ్-మౌత్' బాక్సాఫీస్ వసూళ్లు పడిపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిలిచిందని భావిస్తున్నారు.
►ALSO READ | Karthi 29: కార్తి కొత్త మూవీ టైటిల్ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే?
దిల్ రాజు వంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించినప్పటికీ, కథ, కథనంలో లోపాల వల్ల సినిమా నిరాశపరిచిందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు సుమారుగా రూ. 75 కోట్ల బడ్జెట్ అయిందని టాక్. కానీ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఐదు రోజుల్లో 'తమ్ముడు' సాధించిన వసూళ్లు కేవలం రూ. 5.41 కోట్లు మాత్రమే అని సమాచారం . దీంతో దాదాపు రూ. 70 కోట్లు నష్టం వచ్చినట్లే. కాకపోతే ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా దిల్ రాజు కాస్త ఒడ్డునపడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ 'తమ్ముడు' మూవీలో నిత్ సరసన సప్తమి గౌడ నటించింది. కీలక పాత్రలో లయ, విలన్ గా సౌరభ్ సచ్ దేవా కనపించారు. ఈ సినిమాకు సమీర్ రెడ్డి, సేతు, కె.వి.గుహన్ సినిమాటోగ్రఫీ అందించారు.