గ్రేటర్​ కాంగ్రెస్​లోకి భారీ చేరికలు

గ్రేటర్​ కాంగ్రెస్​లోకి భారీ చేరికలు

జీడిమెట్ల/శంకర్ పల్లి, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్​తగిలింది. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్​రెడ్డి బీఆర్ఎస్​ను వీడి, అధికార కాంగ్రెస్​పార్టీలో చేరారు. సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో 9 మంది కార్పొరేటర్లు, ఓ కోఆప్షన్ మెంబర్ తో కలిసి ఆమె కాంగ్రెస్​తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాలు కప్పి సీఎం రేవంత్​వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మేయర్​నీల మాట్లాడుతూ.. నిజాంపేట కార్పొరేషన్ అభివృద్ధి కోసమే పార్టీ మారానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్​చార్జ్​మైనంపల్లి హనుమంతరావు, కొలను హనుమంతరెడ్డి పాల్గొన్నారు. 

శంకర్​పల్లి మున్సిపల్​చైర్ పర్సన్, జడ్పీటీసీ కూడా..

శంకర్​పల్లి మున్సిపల్​చైర్ పర్సన్ విజయలక్ష్మి, జడ్పీటీసీ గోవిందమ్మ, పలువురు కౌన్సిలర్లు, నాయకులు కాంగ్రెస్​పార్టీలో చేరారు. గురువారం సిటీలోని ఇంట్లో సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..  రాష్ట్రంలో దొరల పాలన పోయి, ప్రజాపాలన వచ్చిందని, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశాంతంగా తమ పనులు చేసుకోవాలని చెప్పారు. అందుకు పూర్తి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు.

లోక్​సభ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి, అసెంబ్లీ ఇన్​చార్జ్​భీం భరత్, టీపీసీసీ కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్​పార్టీ మండల, మున్సిపల్​అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, వై.ప్రకాష్​కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.