గ్రేటర్​లో డైలీ 7 వేల టన్నుల చెత్త ఉత్పత్తి

గ్రేటర్​లో డైలీ 7 వేల టన్నుల చెత్త ఉత్పత్తి
  • మరో 3 చోట్ల డంపింగ్​యార్డులు 
  • ఏర్పాటు చేస్తామని పట్టించుకోని సర్కార్​
  • చలికాలం కావడంతో డంప్​యార్డు పరిసర ప్రాంతాల్లో భరించలేని కంపు

హైదరాబాద్, వెలుగు: జవహర్​నగర్​డంపింగ్ యార్డులో రోజురోజుకు చెత్త లోడు పెరుగుతోంది. గతేడాది వరకు గ్రేటర్ లో డైలీ 6 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవగా, ప్రస్తుతం అది 7 వేల టన్నులకు పెరిగింది. దీంతో  ఈ డంపింగ్​యార్డుకు వచ్చే చెత్త ఎక్కువవుతుంది. పరిసర ప్రాంతాలు మరింత డేంజర్​లో పడుతున్నాయి. ప్రస్తుతం చలికాలం కావడంతో భరించలేని కంపుకొడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊపిరి పీల్చుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇక్కడి సమస్య తీర్చేందుకు సిటీ శివారులోని జిన్నారం, దుండిగల్, పఠాన్ చెరు ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు నెరవేర్చలేదు.  

నెరవేరని కేటీఆర్​ హామీ

ఇప్పటికే డంపింగ్​యార్డులో పేరుకుపోయిన చెత్తకి సరిగ్గా క్యాపింగ్ చేయకపోవడం, రోజురోజుకు వస్తున్న చెత్త అలాగే పేరుకుపోతుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. 2020  నవంబర్​లో డంపింగ్​యార్డులో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. దుర్గంధం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ సమస్య తీరక దుర్వాసన ప్రజలను వేధిస్తూనే ఉంది. క్యాపింగ్ చేసిన చెత్తలోంచి వస్తున్న నీటిని శుద్ధి చేసి బయటకు పంపేందుకు రూ.251 కోట్లతో ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించగా, ఆ పనులు నత్తనడకన నడుస్తున్నాయి.

ఇక్కడ స్థలం లేక..

డంపింగ్‌యార్డు నిర్వహణ పనులు స్టార్ట్​ అయినప్పుడు సిటీ నుంచి డైలీ 2,500–3,000 టన్నుల చెత్త యార్డుకి వచ్చేది. దానికి తగ్గట్లు నిర్వహణ సంస్థ రాంకీ ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పుడు డైలీ 7 వేల టన్నుల చెత్త  వస్తుండటంతో సమస్య తీవ్రమైంది. సామర్థ్యం సరిపోక రోజువారీ చెత్తలో సగం టిప్పింగ్‌ ఫ్లోర్‌పైనే పడేస్తున్నారు. ఇప్పటికే యార్డులో 14 మిలియన్‌ టన్నులకుపైగా చెత్త పేరుకుపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. యార్డుపై ఒత్తిడి పెరిగిందని, కనీసం మరో రెండు ప్రత్యామ్నాయాలుండాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపాదనలు పంపుతున్నా కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇంట్రస్ట్ చూపడం లేదు. సంగారెడ్డి జిల్లాలోని లక్డారం(దుండిగల్ సమీపంలో), మెదక్ జిల్లా ప్యారేనగర్‌(జిన్నారం)లో స్థలాలను ఎంపిక చేసినట్లు చెప్పినప్పటికీ నేటికీ ప్రారంభం కాలేదు.  

ఇండ్లు ఖాళీ!

యార్డు విస్తీర్ణం 351 ఎకరాలు ఉండగా,  చుట్టుపక్కల 15 నుంచి 18 ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ, కార్మిక నగర్‌, బాలాజీనగర్‌, గబ్బిలాలపేట, అంబేద్కర్​నగర్, మల్కారంతోపాటు పలు ప్రాంతాల ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చెత్త నుంచి వచ్చే మురుగుతో మల్కారం చెరువు ఇప్పటికే పూర్తిగా కలుషితమైంది. యార్డులో స్థలం లేక కార్మికనగర్​లో గతంలోనే 16 ఇండ్లను ఖాళీ చేయించారు. కాగా అదే ప్రాంతంలో మరికొంత మంది ఇండ్లను త్వరలో ఖాళీ చేయించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

డంపింగ్ యార్డు చుట్టూ డ్రోన్లు

యార్డు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం డ్రోన్లు కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల నుంచి ఎవరైనా వస్తారేమోనని, లోపల చేసే పనులను  వీడియోలు తీస్తారేమోననే భయంతోనే ఈ డ్రోన్లను వినియోగిస్తున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు. పరిసర ప్రాంతాలకు వెళితే ఆ డ్రోన్లు తమపైకి వస్తున్నాయని చెబుతున్నారు. అసలు డ్రోన్లకు అనుమతి లేనప్పుడు ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 

ఎన్జీటీ ఆర్డర్లు పట్టించుకోవట్లే..

డంపింగ్ యార్డుని తరలించాలని ఎన్జీటీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మూడేళ్లలోపు పూర్తిగా ఖాళీ చేయాలంది. ఏడాదిలోపు బయోమైనింగ్ పనులు స్టార్ట్ చేయాలని ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలను పట్టించుకోవడంలేదు.ఈ విషయంపై ఎన్జీటీ కోర్డులో వచ్చేనెల మళ్లీ విచారణ ఉంది.  

 – పద్మాచారి, డంపింగ్ 
యార్డు యాంటీ జేఏసీ కన్వీనర్ 

వేరే చోటికి తరలించాలి

డంపింగ్ యార్డు లోంచి వస్తున్న మురుగునీటితో భూ గర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. ఆ నీటిని తాగడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. డంపింగ్ యార్డు లోపల ఏం జరుగుతుందో కూడా తెలియడంలేదు. డంపింగ్ యార్డులను వేరే ప్రాంతానికి తరలించాలి.

–శాంతిరెడ్డి, దమ్మాయిగూడ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్