ఎట్టకేలకు గ్రీన్​సిగ్నల్.. రూ.4 వేల 686 కోట్లు శాంక్షన్

ఎట్టకేలకు గ్రీన్​సిగ్నల్.. రూ.4 వేల 686 కోట్లు శాంక్షన్
  •     రాయచూర్–మాచర్ల లైన్​ సర్వేకు రూ.7.40 కోట్లు రిలీజ్
  •     హర్షం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు

వనపర్తి, వెలుగు : 30 ఏండ్లుగా మెరుగైన రైల్వే సేవల కోసం ఎదురు చూస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు కేంద్ర సర్కార్​ ప్రకటన ఆశలు కల్పిస్తోంది. మహబూబ్ నగర్–డోన్  జంక్షన్  డబుల్ లైన్  నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫండ్స్​ కేటాయించడంతో ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు రైలు ప్రయాణంపై ఆధార పడుతుండగా, సింగిల్  లైన్  కారణంగా జర్నీలో ఆలస్యమవుతోంది. మహారాష్ట్రలోని ముద్​ఖేడ్  నుంచి ఏపీలోని డోన్  వరకు ఉన్న సింగిల్ లైన్ ను డబుల్ లైన్ గా మార్చేందుకు కేంద్ర కేబినెట్  ఓకే చెప్పింది. 417.88 కిలోమీటర్ల డబ్లింగ్ కు రూ.4,686.09 కోట్లు కేటాయించింది.

మెరుగుపడనున్న రైల్వే సేవలు..

సికింద్రాబాద్​ నుంచి మహబూబ్ నగర్  వరకు డబ్లింగ్  పనులు పూర్తయ్యాయి. మహబూబ్ నగర్  నుంచి డోన్  వరకు 181 కి.మీ లైన్ నిర్మించాల్సి ఉంది. సికింద్రాబాద్  నుంచి మహబూబ్ నగర్ వరకు 100 కి.మీ ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులు గత ఏడాది పూర్తయ్యాయి. మహబూబ్ నగర్ నుంచి గద్వాల వరకు మొదటి విడతలో పూర్తి చేయగా, గద్వాల నుంచి  కర్నూలు వరకు పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీలను కలుపుతూ ఉన్న ఈ మార్గంలో ప్రయాణికులు, సరుకు రవాణా మరింత పెరిగే అవకాశం ఉంది.

రైళ్లు, గూడ్స్  రాకపోకలు పెరగనున్నాయి. డోన్ వరకు 181 కి.మీ. మేర డబ్లింగ్ పూర్తి చేస్తే సికింద్రాబాద్, షాద్ నగర్, మహబూబ్ నగర్, జడ్చర్ల, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు, డోన్  వరకు రాకపోకలు పెరగనున్నాయి. తిరుపతి, చెన్నై, త్రివేండ్రం, బెంగళూర్​లకు ప్రయాణం మెరుగుపడనుంది. పంట ఉత్పత్తులు, సరుకు, బొగ్గు రవాణా పెరిగే ఆస్కారం ఉంది.

రాయచూర్–మాచర్ల లైన్  సర్వేపై ఆశలు.. 

30 ఏండ్లుగా ఎన్నికల నినాదంగా మారిన రాయచూరు–మాచర్ల రైలు మార్గం సర్వేకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే లైన్ సర్వే కోసం రూ.7.40 కోట్లు  కేటాయించడంతో వనపర్తి , నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నాటక, తెలంగాణ, ఏపీలను కలుపుతూ వనపర్తి మీదుగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలున్నాయి. ప్రతి రైల్వే బడ్జెట్  లో దీనిపై చర్చ జరుగుతున్నా ఆమోదం లభించలేదు. మొదటి విడతగా రాయచూరు నుంచి గద్వాల వరకు రైలు మార్గాన్ని నిర్మించారు. రెండో విడతలో సర్వే చేపట్టేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించాల్సి ఉండగా, దీనిపై రాష్ట్ర సర్కారు ఆసక్తి చూపకపోవడంతో పెండింగ్ పడుతూ వచ్చింది. ఈ మార్గంపై తెలంగాణ బీజేపీ నేతలు దృష్టి పెట్టారు. 

కోస్తాంధ్రతో కనెక్టివిటీ..

ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రయోజనం కలిగే రాయచూర్–మాచర్ల లైన్​​ఏర్పాటుతో తెలంగాణ, కోస్తాంధ్రకు కనెక్టివిటీ ఏర్పడనుంది. ఈ లైన్​తో రవాణాతో పాటు వ్యాపార, వాణిజ్యరంగాలు డెవలప్​ అవుతాయని బీజేపీ నాయకులు వివరించడంతో కేంద్రం అంగీకారం తెలిపింది. 269 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణం కోసం ప్రస్తుతం సర్వే జరగాల్సి ఉంది. రాయచూర్​ నుంచి గద్వాల జంక్షన్ కు ఉన్న రైలు మార్గానికి కొనసాగింపుగా గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, సూర్యాపేట మీదుగా గుంటూర్​ జిల్లా మాచర్ల వరకు రైలు మార్గం నిర్మించనున్నారు. ఇది  పూర్తయితే నాగర్ కర్నూల్  లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి గుంటూర్​ వెళ్లాలంటే దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. రైల్వే లైన్​ ఏర్పాటైతే వనపర్తి నుంచి రెండు గంటల్లో గుంటూర్​కు చేరుకునే అవకాశం ఉంటుంది.