
- పల్లెటూళ్లకు ఇవి చాలా ముఖ్యం
- ఉద్దెర ఇవ్వడంతో జనం వీటివైపే మొగ్గు
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్, సూపర్మార్కెట్స్, హైపర్మాల్స్ వంటివి ఎన్ని వచ్చినా కిరాణాలు సవాళ్లనూ ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాయి. ఎందుకంటే మనదేశంలో వీటికి సామాజికంగానూ ఇంపార్టెన్స్ ఉంటుంది. స్థానికులకు ఇవి ముఖ్యమైన అడ్డాలు. ఇక్కడ బాతాఖానీ నడుస్తుంది. వీటిలో ఉద్దెరకు కూడా సరుకులు ఇస్తారు. పల్లెటూరి జనానికి ఇవి లేనిదే తెల్లారని పరిస్థితి ఉంటుంది. దీంట్లో అమ్మే సరుకుల గురించి కస్టమర్లకు పూర్తిగా తెలిసి ఉంటుంది. కొంచెం బేరసారాలకు అవకాశాలు ఉంటాయి. షాపు యజమానితో బాతాఖానీ కొడుతుంటారు. కిరాణాలతో ఇన్ని సదుపాయాలు ఉన్నా ఒకటో రెండు శాతమో డిస్కౌంట్ కోసం జనం ఆన్‌లైన్ షాపింగ్, మాల్స్ వెంట పడుతున్నారని షాపుల ఓనర్లు బాధపడుతున్నారు. చిన్న వ్యాపారాలను గౌరవించడానికి అమెరికాలో ఏటా మార్చి 29న 'నేషనల్ మామ్ అండ్ పాప్ బిజినెస్ ఓనర్స్ డే'ని పాటిస్తారు. తమ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైన చిన్న వ్యాపారాలను, ముఖ్యంగా కుటుంబ యాజమాన్య వ్యాపారాలను సెలబ్రేట్ చేసుకుంటారు. 'బయ్ లోకల్' అనే నినాదం అమెరికాలోని చిన్న పట్టణాల్లో మారుమోగుతోంది. కిరాణా దుకాణాలు మొత్తం మార్కెట్‌లో దాదాపు 90శాతం వరకు ఉంటాయని అంచనా. భారతదేశంలో దాదాపు 1.1 కోట్ల కిరాణా స్టోర్లు ఉన్నాయి. ఈ అసంఘటిత రంగం చాలా పెద్దది. పన్ను వసూళ్లు పెంచడానికి ప్రభుత్వం వీటిపై దృష్టి సారిస్తోంది. జీఎస్టీ నెట్‌లోని వ్యాపారాల సంఖ్య 2017లో దాదాపు 6 మిలియన్ల నుండి జనవరి 2023 నాటికి 14 మిలియన్లకు పెరిగింది.
సవాళ్లున్నాయ్.. పరిష్కారాలూ ఉన్నాయ్
అమెరికాలో మాదిరే ఇండియాలోనూ ఆన్‌లైన్ సంస్థలు కిరాణాలకు, లోకల్షాపులకు నష్టదా యకంగా మారాయి. ముఖ్యంగా కరోనా సమయంలో ఎన్నో షాపులు మూతబడ్డాయి. అమెజాన్ ఫ్రెష్, బిగ్ బాస్కెట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్, డి-మార్ట్ వంటి భారీ రిటైల్ చైన్స్ కిరాణా యజమానులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. భారీగా కొనడం వల్ల ఇవి వినియోగదారులకు తక్కువ ధరలకు సరుకులను అమ్ముతాయి. పండుగల సమయంలో భారీ తగ్గింపులు ఇస్తాయి. కొన్ని ప్రొడక్టులను సగం ధరలకే అమ్ముతాయి. ఉచిత డెలివరీ కారణంగా చాలా మంది వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఈ కంపెనీలకు మెరుగైన సప్లై చైన్ ఆప్టిమైజేషన్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, ఆన్‌లైన్ ఆర్డరింగ్, ఫాస్ట్ డెలివరీ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇంత భారీగా డిస్కౌంట్లను ఇవ్వడం కిరాణాలకు చాలా కష్టం. అయినప్పటికీ కిరాణాలు నిరాశపడాల్సిన అవసరం లేదని, వీటికీ భవిష్యత్ ఉందని మార్కెట్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. కిరాణా దుకాణాలు మనుగడకు అనేక అవకాశాలు ఉన్నాయి. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, జెప్టో బ్లింకిట్ వంటి ఈ-కామర్స్ యాప్‌లు చిన్న షాపుల నుంచి కొని డెలివరీ చేస్తున్నాయి. కిరాణాలను డిజిటలైజ్ చేస్తున్నాయి. దీనివల్ల అవి ఆన్‌లైన్ ఆర్డర్‌లు తీసుకోవడం సాధ్యమవుతుంది. ఈ యాప్‌లు ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, ఆన్‌లైన్ చెల్లింపులు, డెలివరీ, లాజిస్టిక్స్ వంటి సేవలనూ అందిస్తాయి. చిన్న వ్యాపారాలు పెద్ద ఇ-కామర్స్ కంపెనీలతో పోటీ పడేలా చేస్తాయి.