వనపర్తి మార్కెట్​లో నిలువు దోపిడీ .. నిండా మునుగుతున్న వేరుశనగ రైతులు

వనపర్తి మార్కెట్​లో నిలువు దోపిడీ .. నిండా మునుగుతున్న వేరుశనగ రైతులు
  • నిబంధనలకు విరుద్ధంగా కమీషన్​ వసూళ్లు
  • ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కార్మికులు

వనపర్తి, వెలుగు: వనపర్తి వ్యవసాయ మార్కెట్​ యార్డులో వ్యాపారులు, కమీషన్​ ఏజెంట్లు వేరుశనగ రైతులను దోపిడీ చేస్తున్నారు. మరోవైపు చాట కార్మికులు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వనపర్తి మార్కెట్​కు ఇప్పటి వరకు 60 వేల క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. మార్కెట్ కు తెచ్చిన​వేరుశనగను వ్యాపారి చూసి ధర నిర్ణయించే సమయంలో వివిధ కారణాలు చూపుతూ సరైన రేటు ఇవ్వడం లేదు. 

కమీషన్​ ఏజెంట్లు నిబంధనలకు విరుద్ధంగా కమీషన్​ తీసుకుంటున్నారు. క్వింటాల్​కు రూ.1.75 తీసుకోవాల్సి ఉండగా, ఏకంగా రూ.3 నుంచి రూ.3.50 వరకు వసూలు చేస్తున్నారు. పంట పెట్టుబడి సమయంలో విత్తనాలు, ఎరువులు ఇస్తున్నాడనే కారణంతో రైతులు ఏమి అనలేని పరిస్థితి నెలకొంది. ఇదిలాఉంటే చాట కార్మికులు ఒక్కో వేరుశనగ కుప్ప నుంచి ఒక సంచి(20 నుంచి 30 కిలోల పంట) బలవంతంగా తీసుకుంటున్నారు. 

తగ్గిన వేరుశనగ విస్తీర్ణం.. 

ఈ ఏడాది వనపర్తి జిల్లాలో వేరుశనగ విస్తీర్ణం బాగా తగ్గింది. మార్కెట్​లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పల్లీ సాగును తగ్గిస్తూ వస్తున్నారు. కేంద్రం క్వింటాల్​ వేరుశనగకు రూ.6,377 మద్దతు ధర ప్రకటించగా, మార్కెట్​లో రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. వనపర్తి జిల్లాలో 27 వేల ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా, ఈ ఏడాది 18 వేల ఎకరాలకు పడిపోయింది. వాతావరణం అనుకూలించక ఎకరాకు ఏడెనిమిది క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. యాసంగిలోనూ జిల్లా రైతులు వరి సాగు చేసేందుకే మొగ్గు చూపారు.  

బలవంతంగా పల్లీలు తీసుకుంటున్నరు..

రైతులు మార్కెట్​కు తీసుకొచ్చిన వేరుశనగను తూకం వేశాక సంచుల్లో నింపుతారు. గతంలో అలా నింపగా కింద పడిపోయిన కొంత వేరుశనగను చాట కార్మికులు రైతుల అనుమతితో తీసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రైతులు ఎన్ని క్వింటాళ్లు తెచ్చారనే దాంతో సంబంధం లేకుండా వ్యాపారి వేలం పాడిన కుప్ప నుంచి ఒక సంచి (20 నుంచి 30 కిలోలు) బలవంతంగా తీసుకుంటున్నారు. ఈ సందర్భంలో రైతులు, కార్మికుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. 

వేరుశనగ తూకం వేశాక చాట కార్మికులు కుప్ప వద్ద నుంచి కదలకపోవడంతో రైతులు ఘర్షణ పడుతున్నారు. అదేమని అంటే కమీషన్​ ఏజెంట్​తో మాట్లాడుకోమని తెగేసి చెబుతున్నారు. ఇలా రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. మార్కెట్​​అధికారులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ దోపిడీని అరికట్టాలని రైతులు కోరుతున్నారు.  

కార్మికుల రేట్​ ప్రకటిస్తాం..

మార్కెట్​ యార్డులో రైతులు, చాట కార్మికులతో రైతులు ఘర్షణ పడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. దీనికి పరిష్కారంగా చాట కార్మికులకు ఒక సంచికి కొంత మొత్తం చెల్లించాలని నిర్ణయించాం. త్వరలోనే దీనిని అమలు చేస్తాం. 

శ్రీనివాస్​గౌడ్, ఏఎంసీ చైర్మన్