కమలంలో గ్రూపులు .. కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే ఎత్తులు

కమలంలో గ్రూపులు  ..  కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే ఎత్తులు
  • సొంత పార్టీలో తమకు పోటీ 
  • అనుకున్నోళ్లకు చెక్​ పెట్టే ప్రయత్నాలు
  • పరిస్థితి తెలిసి షాక్​కు గురైన జాతీయ నాయకత్వం
  • రాష్ట్ర నేతల తీరుపై అమిత్​ షా సీరియస్​!

హైదరాబాద్, వెలుగు:  దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఆ పార్టీ తెలంగాణ నేతలు గండి కొడుతున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర బీజేపీ లీడర్లలోని వర్గాలు, గ్రూపులు, లాబీయింగ్​లు  జాతీయ నాయకత్వానికి తలనొప్పిగా తయారైనట్లు చర్చ జరుగుతున్నది. అందరూ కలిసి ముందుకు వెళ్లడం అటుంచితే ఎవరికి వాళ్లు తమకు పార్టీలో పోటీ అనుకున్నోళ్లను ఎంపీ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిపై పార్టీ అంతర్గత వ్యూహకర్తలు జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపినట్లు సమాచారం. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతున్న రాష్ట్ర కీలక నేతలు కొందరు అప్పుడే కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం వ్యూహం రచిస్తున్నారు. తమ గెలుపుతో పాటు ఇంకా పార్టీలో ఎవరు గెలిస్తే తమకు మంత్రి పదవిలో అడ్డువస్తారోనన్న అంచనాతో, అలాంటి వాళ్లు గెలువకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తున్నది.

పరిస్థితి తెలిసి జాతీయ నాయకత్వం​షాక్​

బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలోని పార్టీ స్థితిగతులపై ఎప్పటికప్పుడు ఆరా తీయడంతో పాటు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నది. అయితే పార్టీలోని ఇంటర్నల్ గొడవలు ఒక ఎత్తయితే సొంత పార్టీలో ఒక అభ్యర్థి ఓడాలని మరో అభ్యర్థి చెక్ పెడ్తున్న తీరు తెలిసి జాతీయ నాయకత్వం షాక్​కు గురవుతున్నది. తెలంగాణపై కేంద్ర పార్టీ హైఇంటెలిజెన్స్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసింది. పార్టీ, అభ్యర్థులు బలంగా ఉన్నచోట ప్రత్యర్థి పార్టీలను వీక్ చేయడం, ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతల్ని తటస్థులుగా మార్చడం వంటి వ్యూహాలను రచిస్తున్నది.  ఈ క్రమంలోనే సొంత నేతల వ్యవహారంపై అనేక విషయాలు బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలిశాయని పార్టీ కీలక నేత ఒకరు చెప్పారు. నిన్నటిదాక పార్టీలో తమకు పడని నేతలకు టికెట్ రావొద్దని కొందరు లీడర్లు తెగ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు తమ గెలుపు మాట పక్కనపెట్టి.. తమ భవిష్యత్ కు పోటీ అనుకుంటున్న సొంత పార్టీ క్యాండిడేట్ మాత్రం గెలవొద్దని వ్యూహాలు పన్నుతున్నట్లు పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి వచ్చిందని ఓ నేత తెలిపారు.

తమ ప్రచారం పక్కనపెట్టి..!

తమ ఎన్నికల ప్రచారం గాలికొదిలి పక్క సెగ్మెంట్లలోని సొంత పార్టీ క్యాండిడేట్ల కదలికలపై బీజేపీలోని కొందరు అభ్యర్థులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ‘‘ఫలానా లీడర్ గెలిస్తే సెంట్రల్ కేబినెట్​లో ఉంటరు.. ఆ లీడర్​ ఓడితే నాకే ఆ బెర్త్’’ అని సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలిసింది. ఇటీవల కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ఓ లీడర్  ట్రై చేస్తుంటే ఇతర సెగ్మెంట్​కు చెందిన బీజేపీ అభ్యర్థి సదరు లీడర్​కు ఫోన్​ చేశారట. ‘‘నువ్వు కరీంనగర్​లో పోటీ చేయకు. నువ్వు పోటీ చేస్తే.. అక్కడ బీజేపీ అభ్యర్థి ఈజీగా గెలుస్తడు. నీ వల్ల మావోడి గెలుపు అవసరమా?’’ అని ఫోన్​లో అన్నట్టు బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి వచ్చిందని ఓ లీడర్​ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ కీలక స్థానం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి కరీంనగర్, మహబూబ్ నగర్ స్థానాల్లో పోటీ చేస్తున్న సొంత పార్టీ అభ్యర్థుల ప్రచారం తీరు, బలాబలాలపై ఆరా తీస్తున్నారని పార్టీ వర్గాల్లో బలంగానే చర్చ జరుగుతున్నది. ఇక సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చుట్టూ కూడా కోవర్టులున్నారని, ఆయన మళ్లీ గెలిస్తే తమకు చాన్స్ ఉండదని కొందరు లీడర్లు ఓపెన్ గానే కామెంట్లు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మహబూబ్ నగర్ సెగ్మెంట్ లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ నుంచి పోటీచేస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతారని భావిస్తున్న మరికొంత మంది సొంత పార్టీ లీడర్లు ఆయనపై ఫోకస్​ చేసినట్లు తెలిసింది. అసలు ఎన్నికలు జరగక ముందే కేంద్ర మంత్రి పదవి కోసం సొంత పార్టీలోని తాము ప్రత్యర్థులుగా భావిస్తున్నవాళ్లు ఓడాలని చేస్తున్న ప్లాన్లు హైకమాండ్​ను కలవర పెడ్తున్నాయి. 

నేతల తీరుపై అమిత్​ షా సీరియస్​!

అభ్యర్థులను అందరి కన్నా ముందు ప్రకటించినా బీజేపీలో కొన్ని సెగ్మెంట్లలో ప్రచారం మందకొడిగా సాగుతున్నది. అయితే రాష్ట్ర పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై ఒక అవగాహనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మూడోదశ ప్రచారంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు అన్ని అంశాలపై క్లాస్ తీసుకోనున్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలాసార్లు రాష్ట్ర పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నించిన అమిత్ షా.. ఈసారి మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తున్నది. గెలిచే అవకాశాలు ఉండి కూడా కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీకి నష్టం చేసే వారికి గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.