జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. కేంద్రం కీలక నిర్ణయాలు ఇవే...

జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. కేంద్రం కీలక నిర్ణయాలు ఇవే...

ఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ తగ్గించే అంశంపై మంత్రుల బృందాన్ని(GOM) కేంద్రం ఏర్పాటు చేసింది. 

ఇన్సూరెన్స్ పాలసీలకు జీఎస్టీ తగ్గించే అంశంపై అక్టోబర్ నెలాఖరు నాటికి ఈ మంత్రుల బృందం కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. మంత్రుల బృందం ఇచ్చిన నివేదికపై నవంబర్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం ఇవాళ (సెప్టెంబర్ 9, 2024) జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ ఔషధాలపై 12 శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించింది.

2026 మార్చి తర్వాత జీఎస్టీ పరిహార సెస్ కొనసాగించాలా వద్దా అనే దానిపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆన్లైన్  గేమింగ్స్, కాసినోలపై ఆదాయం భారీగా పెరిగినట్లు కేంద్రం తెలిపింది. గత ఆరు నెలల్లో 412 శాతం ఆదాయం పెరిగిందని కేంద్రం పేర్కొంది. ఆన్లైన్  గేమింగ్స్, కాసినోల ద్వారా రూ.6,909 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. స్నాక్స్పై (GST on Namkeens) జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. కారు, మోటార్ సైకిల్స్ సీట్లపై జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది.