
న్యూఢిల్లీ: కిందటి నెలలో గ్రాస్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.89 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.1.73 లక్షల కోట్లతో పోలిస్తే 9.1శాతం, ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన రూ.1.86 లక్షల కోట్లతో పోలిస్తే 1.5శాతం ఎక్కువ. కొత్త జీఎస్‌టీ రేట్ల ప్రభావం వసూళ్లపై పడింది. 375 వస్తువుల ధరలు తగ్గడంతో వినియోగం పెరిగింది.
దేశీయంగా జీఎస్‌టీ వసూళ్లు ఏడాది లెక్కన 6.8శాతం పెరిగి రూ.1.36 లక్షల కోట్లకు, దిగుమతులపై పన్ను 15.6శాతం పెరిగి రూ.52,492 కోట్లకు చేరింది. జీఎస్‌టీ రిఫండ్లు ఏడాది లెక్కన 40.1శాతం పెరిగి రూ.28,657 కోట్లకు చేరాయి. నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.60 లక్షల కోట్లు. 2025–26 లో నెలవారీ వసూళ్లు సగటున రూ.2 లక్షల కోట్లుగా ఉన్నాయి.
సెప్టెంబర్ 1–21 మధ్య డిమాండ్ తగ్గినా, 22 తర్వాత వినియోగం పెరగడం వల్ల జీఎస్‌టీ వసూళ్లు కొంత పెరిగాయి. అయితే తయారీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సరఫరా తగ్గడం వల్ల వినియోగం పూర్తిగా పుంజుకోలేకపోయింది.