బుల్లెట్ ట్రైన్ కోసం ఫస్ట్​ టన్నెల్ రెడీ

బుల్లెట్ ట్రైన్ కోసం  ఫస్ట్​ టన్నెల్ రెడీ

వల్సాడ్(గుజరాత్): ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్​ కోసం నిర్మిస్తున్న హై-స్పీడ్ రైలు కారిడార్‌‌‌‌లో గుజరాత్ ​రాష్ట్రం వల్సాడ్​ వద్ద 350 మీటర్ల పొడవైన టన్నెల్​తవ్వకం విజయవంతంగా పూర్తయింది. జరోలి గ్రామ సమీపంలో పర్వతాన్ని తొలిచి ఈ సొరంగం తవ్వకాన్ని పూర్తి చేశారు. మొత్తం 508 కి.మీ. బుల్లెట్​ రైల్ కారిడార్​ను నేషనల్​ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్​ లిమిటెడ్ నిర్మిస్తోంది. 

ఈ ప్రాజెక్ట్ వల్సాడ్ సెక్షన్ చీఫ్ మేనేజర్ ఎస్పీ మిట్టల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కి.మీ స్పీడ్​తో వెళ్తుంది, కనుక టన్నెల్ పూర్తిగా స్ట్రైట్(సరళరేఖలో)​గా ఉండాలి. అలా నిర్మించడం చాలా పెద్ద చాలెంజ్. ప్రతి చిన్న అంశాన్ని కూడా కచ్చితంగా పాటించాలి. మేం దీన్నో సవాలుగా తీసుకొని పనిచేశాం.. ఒక్క మిల్లీమీటర్ కూడా తేడా రాలేదు. 

టన్నెల్ ​నిర్మాణం పూర్తి చేసేందుకు చివరి దశపనులు స్టార్ట్ చేస్తం’’ అని అన్నారు. తన సెక్షన్​ పరిధిలో నిర్మించిన మొదటి టన్నెల్ ఇదేనని.. టన్నెల్ విజయవంతంగా పూర్తి చేయడం సంతృప్తిని ఇచ్చిందని అన్నారు.