ఒకే నియోజకవర్గం నుంచి 32 ఏళ్లుగా ఓటమెరుగని ఎమ్మెల్యే

ఒకే నియోజకవర్గం నుంచి 32 ఏళ్లుగా ఓటమెరుగని ఎమ్మెల్యే

రాజకీయాల్లో ఎప్పుడు ఎలా మారుతారో ఎవ్వరూ ఊహించలేరు. ఈ సారి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన వాళ్లకు.. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకపోవచ్చు. కానీ 32ఏళ్లుగా ఏ ఎన్నికల్లోనూ ఓటమి అనే పదం  తెలియకుండా గుజరాత్ లోని ద్వారకా ఎమ్మెల్యే పణుభా మాణెక్ దూసుకుపోతున్నారు. అది కూడా ఒకే నియోజకవర్గం నుంచి గెలవడం గమనార్హం. మాణెక్‌ 1990లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదికూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి  ప్రత్యర్థులను ఓడించాడు. అలా 1995, 1998లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గానే విజయం సాధించారు. 

అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాణెక్.. 2002 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్‌పై గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకుని, 2007, 2012, 2017లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ సారి కూడా తానే ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని, ఎనిమిదోసారి మళ్లీ పదవి చేజిక్కించుకుంటానని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తనను ప్రజలు ఎన్నుకోవడం లేదని, ఎంపిక చేసుకుంటారని ఈ సందర్భంగా చెప్పారు. నియోజకవర్గంలోని అన్నివర్గాల ప్రజలతో తాను సత్సంబంధాలను కలిగి ఉన్నానని, అందుకే ఈ గెలుపు సాధిస్తున్నానని వెల్లడించారు.