న్యూఢిల్లీ: పార్టీ మార్పుపై వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కొట్టిపారేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను పార్టీ మారడం లేదు. కాంగ్రెస్‌లోనే ఉన్నాను. ఎక్కడికి వెళ్లడం లేదు. కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నాను. యూడీఎఫ్ విజయానికి నా వంతు కృషి చేస్తాను. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి నాయకత్వం వహిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తాను”అని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై థరూర్ ప్రశంసల వర్షం కురించారు.
‘‘రాహుల్ గాంధీ క్లారిటీ ఉన్న పొలిటికల్ లీడర్. ఆయన మతతత్వాన్ని వ్యతిరేకించే నాయకుడు”అని పేర్కొన్నారు. పార్టీకి కొన్నిసార్లు ఒక వైఖరి ఉన్నప్పుడు.. అందులో కలగచేసుకోను కానీ, తాను వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రం చెబుతానన్నారు. అభివృద్ధి విషయాల్లో మంచి కనిపించినప్పుడు కచ్చితంగా వాటిని ప్రస్తావిస్తానని చెప్పారు.
