తెలంగాణ నుంచి గల్ఫ్ వలసలు పెరిగినయ్

 తెలంగాణ నుంచి  గల్ఫ్ వలసలు పెరిగినయ్
  • గల్ఫ్ కార్మికుల భద్రత.. సంక్షేమం పట్టించుకోని రాష్ట్ర సర్కార్
  • 2018లో రూ.100 కోట్లు కేటాయించినా పైసా ఇయ్యలే
  • కేరళ విధానాలపై స్టడీలు కాగితాలకే పరిమితం

హైదరాబాద్, వెలుగు: పొట్టకూటి కోసం తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నవారి సంఖ్య రెట్టింపు అయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రం నుంచి నిరుడు గల్ఫ్ వెళ్లిన వారి సంఖ్య 10 వేలు దాటింది. ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా, టూరిస్టు వీసాల మీద వెళ్లి పనిచేసుకుంటున్న వారిని కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కరోనా తర్వాత 2021లో 4,375 మంది తెలంగాణ నుంచి ఉపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్లారు. 2022లో అంతకు మించి వలసలు నమోదయ్యాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత గల్ఫ్‌‌కు వలసలు తగ్గాయని.. వ్యవసాయం సమృద్ధిగా ఉందని.. పనులు దొరుకుతున్నాయని మంత్రులు చేస్తున్న ప్రకటనలు ఉట్టివేనన్న విమర్శలు వస్తున్నాయి.

ఎక్కువగా నిజామాబాద్, హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి 9 దేశాలకు వలస వెళ్లినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో సరిపడా ఉపాధి అవకాశాలు లేకపోవడం, చేసిన అప్పులు, ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు చాలా మంది ఇతర దేశాల బాట పడుతున్నారు. మరోవైపు గల్ఫ్ కార్మికుల భద్రత, రక్షణ కోసం కృషి చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కేవలం ప్రకటనలకే పరిమితమైంది. రెండేండ్ల కిందట కేరళ విధానాలపై చేసిన స్టడీ కాగితాల్లోనే ఉండిపోయింది.

ప్లంబర్లు.. నిర్మాణ కూలీలుగా..

గల్ఫ్‌కు వలస పోయేవారిలో ఎక్కువ మంది స్కిల్ లేని కార్మికులు.. భవన నిర్మాణ రంగంలో సహాయకులుగా, పెయింటర్లుగా, వెల్డర్లుగా, ప్లంబర్లుగా, నిర్మాణ కూలీలుగా, డ్రైవర్లుగా వెళ్తున్నారు. మగవారు టెక్నీషియన్లుగా, మహిళలు ఇంటిపని వారిగా వెళ్తున్నారు. ఎక్కువ మంది యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), సౌదీ, ఖతార్, బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఒమన్‌తోపాటు మలేషియా తదితర దేశాలకు పోతున్నారు. 

కేరళ విధానం లేదు.. నిధులు ఇవ్వడం లేదు

గల్ఫ్ కార్మికుల కోసం కేరళలో అమలు చేస్తున్న ప్రత్యేక పథకాలను ఇక్కడ కూడా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేరళ విధానాలను కూడా స్టడీ చేసింది. కానీ వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు. గల్ఫ్ వలసలను ఆపడానికి సాధారణ పరిపాలన శాఖలో ఎన్ఆర్ఐ సెల్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసినప్పటికీ అదీ తూతూమంత్రంగా పనిచేస్తున్నది. 2018లో రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టినప్పటికీ పైసా రిలీజ్ చేయలేదు. పైగా బీహార్, యూపీ, ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి ఇక్కడ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. కానీ గల్ఫ్‌కు పనికోసం వలస వెళ్తున్నవారిని మాత్రం ఆపలేకపోతున్నది. స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి.. ఇక్కడే మంచి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఫెయిల్ అయింది. దురదృష్టవశాత్తు అక్కడ చనిపోతున్న వారిని తీసుకురావడంలోనూ ప్రభుత్వం తగిన చర్యలను తీసుకులేకపోతున్నది. గల్ఫ్ చట్టాలు తెలియక అక్కడ శిక్షలు అనుభవిస్తున్న అమాయక కార్మికులను విడిపించడంలోనూ తగిన శ్రద్ధ తెలంగాణ ప్రభుత్వం చూపించడం లేదని గల్ఫ్ కార్మికులకు కుటుంబాలు విమర్శిస్తున్నాయి.