
కల్వకుర్తి, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలో ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగుంట్ల పాలెం మండలం బోయలపల్లి గ్రామానికి చెందిన గుప్త వెంకటేశ్వర్లు(35) డెడ్ బాడీ లభ్యమైంది. కాగా అతడి పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వెల్దండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం భార్య దీపికతో గొడవపడి ముగ్గురు పిల్లలు మోక్షిత(8), వర్షిణి(6), శివ ధర్మ(4)తో కలిసి వెంకటేశ్వర్లు బైకుపై డిండి ప్రాజెక్టుకు వచ్చాడు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించగా మూడు రోజులు డిండి, హాజీపూర్ గ్రామాల్లో తిరుగుతూ గడిపాడు. ఆ తరువాత వర్షిణి, శివధర్మను హాజీపూర్ పెట్రోల్ బంక్ దగ్గర వదిలి, పెద్ద కూతురు మోక్షితతో కలిసి వెల్దండ వైపు వచ్చాడు.
ఇదిలా ఉంటే బుధవారం మండలంలోని పెద్దాపూర్ గ్రామ శివారులో వెంకటేశ్వర్లు అనుమానాస్పదంగా చనిపోయి కనిపించగా, పిల్లల జాడ కనిపించలేదు. మృతుడి భార్య దీపికకు సమాచారం ఇచ్చారు. కాగా, ఆమె నాలుగు రోజుల కింద భర్త, ముగ్గురు పిల్లలు కనిపించడం లేదని అక్కడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య దీపిక ఫిర్యాదు మేరకు వెల్దండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.