
నల్గొండ టౌన్, వెలుగు: స్కూల్‌కు వెళ్లి తిరిగివస్తున్న బాలికలకు బైక్‌పై లిఫ్టు ఇస్తానని నమ్మించి దారుణాలకు ఒడిగట్టిన హాజీపూర్ సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష ఖరారైంది. గురువారం నల్గొండ పోక్సో కోర్టు తుది తీర్పు వెలువరించింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి, ఆపై హత్య చేసి పాడుబడ్డ బావిలో పాతిపెట్టిన శ్రీనివాస్‌రెడ్డిని కోర్టు దోషిగా తేల్చింది. మూడు కేసుల్లో వేర్వేరుగా తీర్పులు వెలువరించింది. రెండు కేసుల్లో ఉరి శిక్షతోపాటు మరో కేసులో యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది.
నమ్మించి.. దారుణాలు
నిరుడు ఏప్రిల్ 25న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన శ్రావణి(14) కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మరుసటిరోజు హాజీపూర్ శివారులోని శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ బావి వద్ద శ్రావణికి చెందిన స్కూల్ బ్యాగును స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలో అదే నెల 27న శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న శ్రావణికి శ్రీనివాస్‌రెడ్డి లిఫ్టు ఇస్తానని నమ్మించి బైక్‌పై ఎక్కించుకొని హాజీపూర్ శివారులోని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడని, అక్కడ ఆ బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేసినట్లు తేలింది. మృతదేహాన్ని బావిలో పాతిపెట్టినట్లు వెల్లడైంది. 2019 మార్చి 7న మిస్సయిన మనీషా(17)తో పాటు 2015 ఏప్రిల్ 22న మైసిరెడ్డిపల్లికి చెందిన తుంగని కల్పన(11)ను కూడా ఇదే తరహాలో శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ బావిలో తవ్వకాలు జరపగా.. ఇద్దరు బాలికల ఎముకలు బయటపడ్డాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ అప్పట్లో హాజీపూర్ వాసులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. వివిధ పార్టీల నేతలు, మహిళా, ప్రజాసంఘాలు నేతలు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు.
101 మంది సాక్షులు
ముగ్గురు బాలికల మిస్సింగ్ కేసులను రాచకొండ పోలీసులు సవాల్ గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. నిరుడు జూన్ 3న ఈ కేసుల విచారణకు నల్గొండలో పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడింది. 90 రోజుల్లో పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసులకు సంబంధించి 101 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ తోపాటు సైంటిఫిక్ ఆధారాలను కూడా పోలీసులు కోర్టు ముందు ఉంచారు. అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 13 వరకు కోర్టులో ట్రయల్స్నడిచాయి.
హాజీపూర్ కేసు.. ఎప్పుడేం జరిగింది?
ఏప్రిల్ 25, 2019: యదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో శ్రావణి అనే స్టూడెంట్ మిస్సింగ్. అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసిన పేరెంట్స్. కీసరలోని స్కూల్ నుంచి బొమ్మలరామారం బయల్దేరినట్లు సీసీ టీవీ పుటేజీ ద్వారా నిర్థారణ .గ్రామస్తులు వెతకడంతో హాజీపూర్ శివారులోని ఓ పాడుబడిన బావి వద్ద శ్రావణి స్కూల్ బ్యాగ్ గుర్తింపు
ఏప్రిల్ 26, 2019: హాజీపూర్ సమీపంలోని మర్రి శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ బావిలో శ్రావణి డెడ్‌బాడీ లభ్యం
ఏప్రిల్ 27, 2019: మర్రి శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఏప్రిల్ 28, 2019: విచారణలో మార్చి 7న అదృశ్యమైన అదే గ్రామానికి చెందిన మనీషాపైనా అత్యాచారం చేసి హత్య చేసినట్టు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి. అదే బావిలో కుళ్లిన స్థితిలో మనీషా డెడ్‌బాడీ, ఆమె ఐడీ కార్డును గుర్తించిన పోలీసులు
-ఏప్రిల్ 29, 2019 : విచారణలో 2015, ఏప్రిల్ 22న అదృశ్యమైన మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పన అనే బాలిక ను కూడా కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేసినట్లు వెల్లడి. పక్కనే ఉన్న మరో పాడుబడిన బావిలో డెడ్‌బాడీని పాతిపెట్టినట్లు పోలీసులకు చెప్పిన శ్రీనివాస్‌రెడ్డి
-ఏప్రిల్ 30, 2019 : కల్పన అస్థికలు, స్కూల్ బ్యాగ్‌ను వెలికితీసిన పోలీసులు
-ఏప్రిల్ 30, 2019 : శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై గ్రామస్తుల దాడి, ఇంటికి నిప్పు
-ఏప్రిల్ 30, 2019 : శ్రావణి, మనీషా, కల్పన కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసుల్లో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్, కేసు వివరాలు వెల్లడి
– ఏప్రిల్ 30, 2019 : శ్రావణి మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బొమ్మలరామారం ఎస్‌ఐ వెంకటేష్ సస్పెన్షన్, పలువురికి మెమోలు, కేసు విచారణ భువనగిరి ఏసీపీకి అప్పగింత
– మే 1, 2019 : నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు,14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్, వరంగల్ సెంట్రల్ జైల్‌కు తరలింపు
-మే 8, 2019 : శ్రీనివాస్‌రెడ్డిని ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన నల్గొండ కోర్టు
-మే 13, 2019 : పోలీస్ కస్టడీ ముగియడంతో వరంగల్ సెంట్రల్ జైల్‌కు తరలింపు
– జూన్ 3, 2019 : మరోసారి మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి మర్రి శ్రీనివాస్‌రెడ్డి
-హాజీపూర్ వరుస హత్యల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు
– జూలై 31, 2019 : హాజీపూర్ వరుస హత్య కేసుల్లో వేర్వేరుగా మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన పోలీసులు
-అక్టోబర్ 14, 2019 : ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ షురూ
-అక్టోబర్ 29, 2019 : విచారణకు స్వయంగా హాజరైన రాచకొండ సీపీ మహేశ్ భగవత్
-ఫిబ్రవరి 06, 2020: రెండు కేసుల్లో ఉరి శిక్ష, ఒక కేసులో యావజ్జీవం వేస్తూ నల్గొండ పోక్సో
కోర్టు తీర్పు