సగం పనులు కూడా పూర్తి కాని అంతర్గత రోడ్ల పనులు

సగం పనులు కూడా పూర్తి కాని అంతర్గత రోడ్ల పనులు
  •  ఇప్పటి వరకు 109 పనులే .. అన్నీ పూర్తి కాకపోతే నిధులు వెనక్కి 
  •  బిల్లులు రావని పనులకు ముందుకు రాని కాంట్రాక్టర్లు 
  • జిల్లాలో 429 రోడ్లకు రూ. 34 కోట్లు మంజూరు 

 ఆదిలాబాద్, వెలుగు :జిల్లాలోని గ్రామీణా ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల కోసం ఎన్​ఆర్​ఈజీఎస్​ కింద ఈ ఏడాది రూ. 34 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో జిల్లా వ్యాప్తంగా 429 సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది.  నిర్మాణ సామాగ్రికి 60 శాతం, కూలీలకు 40 శాతం నిధులు ఆయా పంచాయతీలకు కేటాయించారు. ఈ రోడ్లు పూర్తి చేయడానికి మరో రెండు వారాలు మాత్రమే గడువు మిగిలి ఉంది. మార్చి 31   వరకు రోడ్లు  పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి  వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 

సగం పనులు కూడా కాలే.. 

ఇప్పటి వరకు  కేవలం 109 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 320 పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో సగం పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ నేపథ్యంలో గడువులోగా పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. జిల్లా అధికారులు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఉపాధి హామీ రోడ్లు త్వరగా ప్రారంభించాలంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ   ముందుకు కదలడం లేదు.  రూ. 1.18 కోట్లతో 18 డ్రైనేజీలు మంజూరు కాగా ఈ పనులు కూడా ఇంకా ప్రొగ్రెస్ లోనే ఉన్నాయి.  

బిల్లులు రావని..

గ్రామీణా ప్రాంతాల్లో చేపట్టే సీసీ రోడ్లు చాలా వరకు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, పలువురు లీడర్లే చేస్తుంటారు. అయితే చేసిన పనులకు సమయానికి బిల్లులు రావనే ఉద్దేశంతో చాలా గ్రామాల్లో పనులు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అందుకే నిధులు మంజూరైనప్పటికీ జిల్లాలో సగం పనులు ఇంకా ప్రారంభం కావడం లేదు. అధికారులు మాత్రం పనులు గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే గతేడాది గడువు తర్వాత కూడా రోడ్ల పనులకు అవకాశం ఇచ్చారు.   చేసిన పనులకు సంబంధించి ఇంకా రూ. 8 కోట్లు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో చేసే పనులకు బిల్లులు రాక సర్పంచ్ లు అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే సీసీ రోడ్ల నిర్మాణాలపై నీలి నీడలు నెలకొన్నాయి. అక్కడక్కడ పలుకుబడి ఉన్న లీడర్లు కాంట్రాక్టు పట్టుకుంటున్నారు. అయితే రూ. 3 లక్షల లోపు ఉన్న పనులు మాత్రమే చేపడుతుండగా రూ. 10 లక్షల పనులపై ముందుకు రావడం లేదని తెలుస్తోంది.  కొంత మంది సర్పంచులు గ్రామాభివృద్ధి కోసం తప్పని పరిస్థితుల్లో పనులు పూర్తి చేస్తున్నారు. అయితే ఎక్కువ గ్రామాల్లో బిల్లులసమస్యతో పనులు చేసేందుకు సర్పంచ్ లు కూడా ముందుకు రావడం లేదు. 

నాణ్యతకు తిలోదకాలు..

ప్రతి సారి ఏడాది  చివరిలో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతుంటారు. ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు చేసిన తర్వాతే కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి పంపుతారు. ప్రస్తుతం మరో 15 రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్​ ముగియనుండటంతో పనులు పూర్తి చేస్తారో లేదోని అనుమానాలువ్యక్తమవుతున్నాయి. గతంలో మార్చి చివరి వారంలో హడావుడిగా పనులు చేపట్టడంతో కొన్ని చోట్ల నాణ్యత లోపాలు బయటపడ్డాయి. ఈ ఏడాది సైతం కొన్ని చోట్ల ఇష్టారీతిన కాంట్రాక్టర్లు పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. పాత రోడ్డు పూర్తి చెడిపోకముందే దానికి కొత్త రోడ్డును మంజూరు చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పనుల నాణ్యతపై పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. 

గడువులోగా పనులు పూర్తి చేస్తాం...

ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రస్తుతం సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. 429 రోడ్లకు రూ. 34 కోట్లు మంజూరయ్యాయి. పనులు త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించాం. 

- మహవీర్, పంచాయతీ రాజ్ ఈఈ