V6 News

వెలుగు ఓపెన్ పేజీ.. అతివ‌‌ల‌‌కు రాజకీయ రిజ‌‌ర్వేష‌‌న్లు అంద‌‌ని ద్రాక్షేనా?

వెలుగు ఓపెన్ పేజీ.. అతివ‌‌ల‌‌కు రాజకీయ రిజ‌‌ర్వేష‌‌న్లు అంద‌‌ని ద్రాక్షేనా?

మ‌‌న సమాజంలో  స‌‌మ‌‌భాగంగా ఉన్న మహిళలకు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం లభించడంలేదు.  ఇన్నాళ్లు వంటింటి  కుందేళ్లలాగ,  బావిలో కప్పలలాగ ఉన్న విష‌‌యం అంద‌‌రికీ  తెలిసిందే.  శ‌‌తాబ్ధాలుగా విధాన‌‌ప‌‌ర నిర్ణయాలలో  సంఘ  పెత్తనంలో ఆమె పాత్ర  సుదూరంగానే ఉంది. అయితే,  గ‌‌త కొంతకాలంగా పెరిగిన నాగరికత, ఆధునిక‌‌త పుణ్యమా అని మహిళ తన పాత్రని అన్ని రంగాలలో  క్రీయాశీల‌‌కంగా పోషిస్తోంది.  ఒకవైపు ఇంటిని చక్కదిద్దుకుంటూనే  ఇంకొకవైపు  పారిశ్రామికవేత్తలుగా... శాస్త్రవేత్తలుగా మహిళలు విశిష్ట సేవలందిస్తున్నారు.

అంతరిక్ష రంగం  మొదలుకుని రక్షణ రంగం వరకు  ధైర్యసాహసాలతో తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు.  దేశాన్ని కాపాడే సైనికురాలుగా  సైతం మ‌‌హిళ త‌‌న పాత్ర  సమర్థవంతంగా  నిర్వహిస్తోంది.   అవ‌‌కాశం కల్పిస్తే  ఏ రంగంలోనైనా దూసుకుపోతాం అంటూ మ‌‌హిళ‌‌ల్లో చాలా ఉత్సాహం ఇటీవ‌‌ల కాలంలో స్పష్టంగా  క‌‌నిపిస్తోంది.  అయితే, అన్ని రంగాలలో  మహిళ పాత్ర ఒక ఎత్తు అయితే  రాజకీయ రంగంలో అతివల పాత్ర ఇంకొక ఎత్తు.   ఎందుకంటే, రాజకీయ రంగం అత్యంత కీల‌‌క‌‌మైంది.   

రాజ‌‌కీయ యువనికపై  మహిళల పాత్ర స్వల్పం

రాజ‌‌కీయ  యువనికపై  మహిళలు క్రియాశీలకంగా వ్యవహరించడం చాలా స్వల్పం.  ఉన్నత  సమాజం  నుంచి వచ్చిన మహిళలు,  విద్యాధికులు మాత్రమే రాజ‌‌కీయాల్లో రాణించ‌‌గ‌‌లుగుతున్నారు. నిమ్నవర్గాలు, వెనకబడిన  స్త్రీల పాత్ర రాజకీయరంగంలో  చాలా తక్కువ.  ఈ అంశంపై  మ‌‌రింత  మార్పు రావాల్సిన అవ‌‌స‌‌రం ఉంది.   ఎక్కడైతే  స్త్రీలను పూజిస్తారో.... అక్కడ దేవుళ్లు  కొలువై  ఉంటార‌‌న్నది  మ‌‌న  స‌‌మాజంలో  బ‌‌లంగా  నాటుకుపోయిన  ఒక విశ్వాసం.  అంటే దాని అర్థం... అవ‌‌నిలో స‌‌గం... ఆకాశంలో స‌‌గ‌‌మైన ఆడ‌‌బిడ్డల‌‌కు అన్ని రంగాల్లో అవ‌‌కాశాలు క‌‌ల్పించాల‌‌న్నదే.   ఒకనాడు  మహిళలు  అవ‌‌కాశాల‌‌కు ఆమ‌‌డ దూరంలోనే ఉండే  ప‌‌రిస్థితి.  కానీ,  నేడు  మహిళలు ఈ  ప్రపంచపు  ప్రగతిరథ  చక్రాలని  స‌‌గ‌‌ర్వంగా  చెబుతున్నారు.  ప్రస్తుతం  పార్లమెంటులో  డీలిమిటేషన్​తో  లింకు పెట్టడంతో  మ‌‌హిళా  రిజ‌‌ర్వేష‌‌న్ల బిల్లు వీగిపోయిన  ప్రత్యేక సంద‌‌ర్భంగా... మ‌‌నమంతా ఒక‌‌సారి మ‌‌హిళా సాధికారత, రిజ‌‌ర్వేష‌‌న్ల మీద ఆత్మావ‌‌లోక‌‌నం  చేసుకుందాం. 

రాచరికం పోయి రాజ్యాంగం వచ్చింది

రాచరికాలు పోయి రాజ్యాంగం వచ్చింది.  కానీ, నేటికీ రాజకీయరంగంలో  మ‌‌హిళ‌‌ల‌‌కు  ప్రాతినిధ్య  ఆశించిన మేరకు లభించలేదు. వాస్తవానికి  మహిళలకు ఇంటినుంచి బయటకు అడుగుపెట్టే  స్వాతంత్య్రం వ‌‌చ్చేందుకు చాలాకాలం  ప‌‌ట్టింది.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి  సుమారు 75 ఏండ్లు  త‌‌ర్వాత  అధికారికంగా అతివ‌‌లు అంద‌‌లమెక్కే అద్భుత అవ‌‌కాశం ల‌‌భించింది.  ఇప్పటికైనా  మ‌‌హిళ‌‌లకు  రిజ‌‌ర్వేష‌‌న్లు లభించే  అవకాశం  వ‌‌చ్చినందుకు ఒక  తెలంగాణ ఆడ‌‌బిడ్డగా  నాకెంతో సంతోషంగా ఉంది.  

భారత  ప్రజాస్వామ్య చరిత్రలో  దశాబ్దాల నిరీక్షణకు తెర‌‌ప‌‌డిందని సంతోషపడుతున్న తరుణంలో..  మహిళా కోటా బిల్లు పార్లమెంటులో వీగిపోవ‌‌డం కేవలం ఒక చట్టబ‌‌ద్ధమైన  ప్రక్రియ మాత్రమే  కాదన్న విష‌‌యం అంద‌‌రూ గ్రహించాలి.  అబలలు  సబలలుగా మారి,  ఈ నేల‌‌ విధాన నిర్ణయాల్లో  విలువైన భాగస్వాములయ్యే సరికొత్త  అవ‌‌కాశం అందించాలి.  వ‌‌ల‌‌స‌‌వాదుల నుంచి ఈ దేశానికి స్వాతంత్య్రం వ‌‌చ్చి  భార‌‌తదేశం  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించింది.  కానీ, అప్పటి జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో ల‌‌భించ‌‌లేదు.  దీంతో చ‌‌ట్టస‌‌భ‌‌ల్లో మ‌‌హిళ ప్రాతినిధ్యం  నామ‌‌మాత్రంగానే  మిగిలిపోయింది. 

మహిళా బిల్లు ఒక సుదీర్ఘ  పోరాటం

మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రయాణం ఒక సుదీర్ఘ పోరాటం.  దాదాపు 27 ఏళ్ల  నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా  మారుతుందని భావించాం.  ఈ  అసమానతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు భారత రాజకీయ ముఖచిత్రాన్ని  సమూలంగా మారుతుందని అనుకున్నాం.  ఆధునిక సాంకేతికత,  ఆర్థిక వనరులను జోడించి మహిళలు  ప్రపంచంతో పోటీపడుతున్నారని చెప్పుకునేవాళ్ళం.  అయితే, అవ‌‌కాశాల్లో మాత్రం ఇంకా అత్యంత వివ‌‌క్ష కొనసాగుతున్నది.  దీనికి  చ‌‌ర‌‌మ‌‌గీతం పాడే స‌‌మ‌‌యం  ఆస‌‌న్నమైంది.   

వాస్తవానికి  మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన దాదాపు 27 ఏళ్లుగా వాయిదా ప‌‌డుతూ వ‌‌చ్చింది. మాజీ ప్రధాని  దేవెగౌడ ప్రభుత్వ హయాం (1996)లో  మొదటిసారి 81వ  రాజ్యాంగ సవరణ బిల్లుకు ఏకాభిప్రాయం లేక వీగిపోయింది.  తర్వాత 1998, 1999, 2002, 2003లో అటల్  బిహారీ  వాజ్​పేయి  ప్రభుత్వం  ప్రయత్నించినా, విపక్షాల  అభ్యంతరాల వల్ల బిల్లు ఆమోదం పొందలేదు.  మన్మోహన్‌‌సింగ్ ప్రభుత్వ హయాంలో 2010లో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే లోక్‌‌సభలో పెండింగ్‌‌లో పడింది. 2014లో లోక్‌‌సభ రద్దు కావడంతో ఆ బిల్లు కూడా రద్దయింది.  

మహిళా సాధికారత కేవలం నినాదం కాదు

 ప్రధాని మోదీ నేతృత్వంలోని  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 2023లో  కొత్త పార్లమెంట్ భవనంలో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 20,  2023న లోక్‌‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో బిల్లు  దాదాపు  ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌‌సభలో ఆమోదించి, 2029 సాధారణ ఎన్నికల నాటికి అమలు చేయాలనే లక్ష్యంతో  కేంద్రం నిర్ణయం తీసుకుని ప్రత్యేక సమావేశాలను నిర్వహించింది.  కానీ, దాన్ని డీలిమిటేష‌‌న్​తో లింకుపెట్టి కేంద్ర ప్రభుత్వం  పార్ల మెంటులోకి  తీసుకురావ‌‌డంతో అక్కడ అది పాస్ కాకుండా పోయింది. మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు.  దేశాభివృద్ధిలో అది ఒక భాగమని  పాల‌‌కులు గుర్తించాలి.  ఎందుకంటే, ఈ  ప్రపంచంలో ఏ ఉద్యమమైనా... మ‌‌రే  పోరాటమైన మ‌‌హిళా భాగ‌‌స్వామ్యం లేకుండా ఏమీ జ‌‌ర‌‌గ‌‌ద‌‌న్న విష‌‌యం ప్రతి ఒక్కరూ గుర్తెర‌‌గాలి.

- నేతి మంగమ్మ,అసిస్టెంట్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వం
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.